AP Roads : జగన్ విశ్వసనీయతకు గొయ్యి!
`మడమ తిప్పడం మాట మార్చడం వైఎస్ కుటుంబం రక్తంలోనే లేదు. విశ్వసనీయతకు మారుపేరుగా చెప్పుకుంటారు జగన్. `
- By CS Rao Published Date - 11:55 AM, Fri - 15 July 22

`మడమ తిప్పడం మాట మార్చడం వైఎస్ కుటుంబం రక్తంలోనే లేదు. విశ్వసనీయతకు మారుపేరుగా చెప్పుకుంటారు జగన్.` కానీ, సీఎం హోదాలోనూ జగన్ మాట నిలువునా తప్పారు. ప్రతిపక్షం నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన మద్యం నిషేధం మాట అడ్డంగా తప్పడం అందరికీ తెలిసిందే. సీఎం అయిన తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారు. ఇప్పుడిదే సోషల్ మీడియా వేదికగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆడిన మాట ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పారు. ఆయన చెప్పిన తేదీ జూలై 15వ తేదీ వచ్చినప్పటికీ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి మాత్రం మారలేదు.
`జులై 15 నాటికి రహదారులపై ఉన్న గుంతల్ని పూడ్చాలి. జులై 20న బాగు చేసిన రోడ్ల ఫోటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. డెవలప్ మెంట్ పనులకు ఎక్కడా లోటు లేదు. రాబోయే రోజుల్లో కచ్ఛితంగా ఫలితాలు కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయటం, గోతులు లేని రోడ్లను తీర్చిదిద్దాలి’ అంటూ జూన్ లో మాట ఇచ్చారు. క్యాలెండర్ లో ఆయన చెప్పిన జులై 15 వచ్చేసింది. జూన్ తో పోలిస్తే ఏపీ రహదారులు మరింత దారుణంగా తయారు కావడం సోషల్ మీడియాకు ఎక్కింది.
ప్రతి ఏడాది 8 వేల కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారుల నిర్వహణ, రిపేర్లు చేపట్టాలి. గడిచిన మూడేళ్లుగా రోడ్లను పట్టించుకోలేదు. మూడేళ్లలో 24 వేల కి.మీ. రోడ్ల నిర్వహణ చేపట్టాలి. కానీ, సీఎం జగన్ మాత్రం 8268 కి.మీ. రహదారుల మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాటితో పాటు మిగిలిన వాటిని ఎప్పుడు చేస్తారో అయోమయం. సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి వస్తోన్న రియాక్షన్ జగన్ కు తలనొప్పే. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు గోతుల మయంగా మారడం. వీటిపై కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారం ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఏపీలో రోడ్ల దుస్థితి మీద బోలెడెన్ని వీడియోలు, ఫోటోలు, మీమ్స్ తో జగన్ సర్కారు నిర్వాకంపై వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తున్నారు. రోడ్ల దుస్థితి మీద విపక్షాలు సైతం గళం విప్పేసరికి జూన్లో ఘనమైన ప్రకటన చేశారు ఏపీ ముఖ్యమంత్రి. కానీ, ఆచరణ సాధ్యం కాకపోవడంతో మళ్లీ మీమ్స్ తో సోషల్ మీడియా నిండిపోతోంది. జనసేనాని పవన్ ఏపీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారానికి పిలుపు నిచ్చారు. ఆ మేరకు జనసైన్యం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం సైతం ఐటీడీపీ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఫలితంగా మాట తప్పిన జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.