AP Liquor Scam : కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలకు షాక్.. ముందస్తు బెయిల్‌కు ‘సుప్రీం’ నో
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
- By Pasha Published Date - 01:18 PM, Fri - 16 May 25

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు బెంచ్ కొట్టివేసింది. వీరిద్దరు ముందస్తు బెయిల్ కోసం ఇంతకుముందు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా చుక్కెదురు అయింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇవాళ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల పిటిషన్లపై జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే, ఏపీ లిక్కర్ స్కాం కేసు విచారణ అధికారి చేతులను కట్టేసినట్లు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read :Defence Budget : ఏకమైన టర్కీ, అమెరికా, పాక్.. రక్షణ బడ్జెట్‌ను పెంచేసిన భారత్
చెరో 150 ప్రశ్నలు అడిగిన సిట్
వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కీలక నిందితులుగా ఉన్నారు. వీరిద్దరినీ గురువారం రోజు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) గంటల తరబడి ప్రశ్నించింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను చెరో 150 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువ ప్రశ్నలను అడిగారట. అయితే వేటికీ వారు సరిగ్గా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఇప్పటికప్పుడు బ్యాంకు లావాదేవీల రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలం అని దర్యాప్తు అధికారులనే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ఈ ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. ఈరోజు కూడా వారిని విచారిస్తున్నారు.
Also Read :Trump Asim Deal : పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్తాన్ బిగ్ డీల్ ?
ఈ కంపెనీలతో డీల్స్‌పై సిట్ ఫోకస్
కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి ఎక్కడి నుంచి నిధులొచ్చాయి? అనే సమాచారాన్ని రాబట్టడంపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. క్రిస్టల్ మాన్‌సన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రోహిత్‌రెడ్డికి మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు.