IAS Chinaveerabhadrudu : జగన్ పాలనలో ఐఏఎస్ వీరభద్రుడికి జైలు శిక్ష
ఐఏఎస్, ఐపీఎస్ లకు శిక్షలు పడడం నాడు వైఎస్ హయాంలోనూ నేడు జగన్ పాలనలో సర్వసాధారణంగా మారింది.
- Author : CS Rao
Date : 04-05-2022 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఐఏఎస్, ఐపీఎస్ లకు శిక్షలు పడడం నాడు వైఎస్ హయాంలోనూ నేడు జగన్ పాలనలో సర్వసాధారణంగా మారింది. అప్పట్లో ఓబులాపురం, క్విడ్ ప్రో కో కింద ఆరడజను మంది ఐఏఎస్ లు కోర్టు బోనెక్కారు. కొందరు జైలుకు వెళ్లారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇటీవల ఐదుగురు ఐఏఎస్ లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష కు ప్రత్యామ్నాయంగా సేవాశిక్షను వేసింది. తాజాగా మాజీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు(ఐఏఎస్)కు నాలుగు వారాలు జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడు ఇటీవల రిటైర్ అయ్యారు. ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా జగన్ హయాంలో పనిచేశారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న చట్ట వ్యతిరేక నిర్ణయంపై హైకోర్టు విచారించింది. ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకెళితే పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ హోదాలో చినవీరభద్రుడు గతంలో ఓ మెమో జారీ చేశారు. ఆ మెమో ప్రకారం ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లుగా ఉన్న ఉపాధ్యాయులు బీపీఈడీ కోర్సును అభ్యసించేందుకు అవకాశం ఉండదు. ఈ కోర్సు సర్టిఫికెట్ లేని కారణంగా పదోన్నతులకు ఇబ్బంది కలుగుతోందని ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన ఎస్జీటీలు గతేడాది హైకోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మెమోను రద్దు చేస్తూ ఎస్జీటీలు బీపీఈడీ కోర్సు చేసేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఆనాడు హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను చినవీరభద్రుడు అమలు చేయలేదు. దీంతో మరోమారు ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల విద్యా శాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదానికి కారణమైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడికి 4 వారాల పాటు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను విధించింది. విచారణకు హాజరైన పాఠశాల విద్యా శాఖ అధికారులు క్షమాపణ చెప్పినా హైకోర్టు పట్టించుకోలేదు. ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనతో శిక్ష అమలును 2 వారాల పాటు వాయిదా వేసింది.