AP DGP: ఏపీ కొత్త డీజీపీ సీరియస్ వార్నింగ్.. వ్యవస్థల జోలికొస్తే..
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
- Author : Hashtag U
Date : 20-02-2022 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరిస్తూ, వివాదాలకు తావు ఇవ్వకుండా పని చేసేలా యంత్రాంగాన్ని నడిపిస్తానని చెప్పారు.
అదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థలపై ఎవరైనా దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. బాధ్యులపై చర్యలు తప్పవని సీరియస్‌గా చెప్పారు. పోలీసులు ప్రవర్తన నియామవళిని కచ్ఛితంగా పాటించాల్సిందేనని ఏపీ కొత్త డీజీపీ అన్నారు. డ్యూటీలో వారిపై నిరాధార ఆరోపణలు వచ్చినప్పడు మాత్రం వారికి అండగా ఉంటామని చెప్పారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా చూస్తామని తెలిపారు. వారు దురుద్దేశ పూర్వకంగా ఎవరిపైన అయినా కేసులు నమోదు చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతన యూనిట్ల ఏర్పాటుపై అధ్యయనానికి సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్టు డీజీపీ చెప్పారు. ఉగాది నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వీఐపీల పర్యటనల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి కమిటీ వేస్తామని తెలిపారు.
మతపరంగా ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే స్థానికంగా పరిష్కరించుకోవాలే తప్ప పెద్దవి చేసుకోకూడదని హితవు పలికారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు.