YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు ప్లస్’.. పింఛన్లు రూ.3500కు పెంపుతో పాటు హామీలివీ
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
- Author : Pasha
Date : 27-04-2024 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చామని సీఎం జగన్ ప్రకటించారు. తాను సాధ్యమయ్యే హామీలు ఇచ్చి హీరోలా జనాల్లోకి వెళ్తున్నానని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాల అమలును ఆపలేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 31వేల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ తెలిపారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. పిల్లలను చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానన్నారు. తాను చూసిన పరిస్థితులకు పరిష్కారాన్ని చూపించే దిశగా తన పాలన సాగిందని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని జగన్ పేర్కొన్నారు. రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join
2019లో ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్సార్ సీపీ ఈసారి ‘నవరత్నాలు ప్లస్ 2024’ పేరుతో మేనిఫెస్టో(YSRCP Manifesto) విడుదల చేసింది. ముఖ్యంగా యువత, మహిళలు లక్ష్యంగా ప్రత్యేక హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. గతంలోలాగే ఈసారి కూడా 2 పేజీలలో 9 హామీలిచ్చారు.
ముఖ్య హామీలివీ..
- రెండు విడతల్లో పింఛన్లు రూ.3500కు పెంపు
- వైఎస్‌ఆర్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో లక్ష యాభైవేల రూపాయలు అందిస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.75వేలే అందిస్తున్నారు.
- వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం కింద నాలుగు దఫాల్లో రూ. 1.20,000 సాయం అందిస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.60వేలే అందిస్తున్నారు.
- వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం- రూ. 1,05000
- జగనన్న అమ్మఒడి పథకం కింద అందించే సాయాన్ని రూ.15వేల నుంచి రూ.17,000కు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు.
- వైఎస్‌ఆర్ ఆసరా కింద రూ.3,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు
- రైతు భరోసా సాయం రూ.13500 నుంచి రూ.16000కు పెంపు (పంట వేసే సమయంలో రూ.8000, మధ్యలో రూ.4000, కటింగ్ సమయంలో రూ.4000 ఇస్తామన్నారు. )
- వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను కొనసాగిస్తామని జగన్ చెప్పారు.