AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet meeting : ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాలు కింద దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం విధానాలకు ఆమోదముద్ర వేయనుంది
- Author : Sudheer
Date : 22-10-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశం ఉ. 11 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాలు కింద దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం విధానాలకు ఆమోదముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లో లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. తద్వారా అర్హుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. చెత్త పన్ను రద్దు పై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఇంకా..
13 కొత్త మున్సిపాలిటీలలో 190 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనను కూడా మంత్రివర్గం చర్చించనుంది.
దేవాలయాల పాలక మండళ్ల నియామకం కోసం చట్ట సవరణపై ప్రతిపాదనలు ముందుకు రావడం కూడా ఖాయంగా ఉంది. 15 సభ్యుల పాలక మండలిని 17 మందికి పెంచే ప్రతిపాదనను కూడా చర్చించనున్నారు.
పాలక మండలిలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు గురించి కూడా చర్చ జరుగనుంది.
CM చంద్రబాబు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టులకు నిధుల సద్వినియోగం, పోలవరం ప్రాజెక్టుకు ఇటీవల విడుదల చేసిన రూ. 2,800 కోట్లపై అధికారులు వివరాలు అందించనున్నారు.
అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం పొందిన విషయమై కూడా తదుపరి అడుగుల గురించి చర్చ జరగనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం కూడా ఈ సమావేశంలో చర్చించబడనుంది.
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలపై, వాలంటీర్ల సేవలు కొనసాగింపుపైన, మరియు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
Read Also : Amaravati Drone Summit 2024 : 5 గిన్నిస్ రికార్డ్స్ తో చరిత్ర సృష్టించిన ‘డ్రోన్ షో’