AP – Caste Census : కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP - Caste Census : కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
- Author : Pasha
Date : 03-11-2023 - 1:44 IST
Published By : Hashtagu Telugu Desk
AP – Caste Census : కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేసింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయించాలని డిసైడ్ చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈమేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 38 ప్రతిపాదనలపై ఈ భేటీలో డిస్కస్ చేశారు. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, 6790 హైస్కూళ్లలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాలను కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. మున్సిపాలిటీలో రూ.8కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని క్యాబినెట్ ఎదుట పురపాలక శాఖ ప్రతిపాదించింది.