AP Assembly : ఏపీ శాసనసభ, శాసన మండలి నిరవధిక వాయిదా
ఈ సభల్లో 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పదిరోజులపాటు కొనసాగాయి.
- Author : Latha Suma
Date : 22-11-2024 - 5:32 IST
Published By : Hashtagu Telugu Desk
AP Assembly : ఏపీ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. సభ మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సభల్లో 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పదిరోజులపాటు కొనసాగాయి. అంతేకాక.. సీఎం చంద్రబాబు నాయుడితోపాటు మంత్రులు ఎనిమిది ప్రకటనలు చేశారని స్పీకర్ చెప్పారు. ఈ సభలో రెండు లఘు చర్చలతో పాటు, మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారని గుర్తు చేశారు. సభలో వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిందన్నారు. అదే విధంగా మూడు కమిటీలకు ఎన్నిక కూడా జరిగిందని స్పీకర్ తెలిపారు.
మరోవైపు.. రాష్ట్ర శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 08 బిల్లులను మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. అదేవిధంగా లోకాయుక్త సవరణ బిల్లు 2024 కు ఆమోదం పలికింది. సహజవాయువు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024ను శాసనమండలి ఆమోదించింది. ఈ రెండు సభలు ఈ నెల 11న ప్రారంభమైన విషయం తెలిసిందే.
కాగా, వైఎస్‌ఆర్‌సీపీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు సమావేశాలకు హాజరుకాలేమని ఆ పార్టీ నేత జగన్ చెప్పారు. కేవలం శాసన మండలికి మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలోవైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ టీడీపీ మంత్రుల మధ్యలు మాటలయుద్ధం సాగింది.
Read Also: Adani Group Stocks: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 6 శాతం పెరిగిన అదానీ గ్రూప్ షేర్లు!