వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్ కు సంబంధించి మరో వీడియో వైరల్
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు
- Author : Sudheer
Date : 13-02-2026 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు వాణి తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆమె తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరికీ భయపడి దాక్కోలేదని స్పష్టం చేస్తూనే.. తనను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే వర్గీయులు భారీగా డబ్బులు ఖర్చు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, వాణి స్పందిస్తూ.. జనసేన విచారణ కమిటీ ఇప్పటివరకు తనను సంప్రదించలేదని వెల్లడించారు. కమిటీ తనను పిలిస్తే వాస్తవాలన్నీ వివరిస్తానని, అన్యాయం జరిగిన తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా, పార్టీ పరంగా కూడా తన గొంతు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఈ వరుస ఆరోపణలు అటు కూటమి ప్రభుత్వంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. బాధితురాలు నేరుగా పవన్ కళ్యాణ్ సహాయం కోరడం ఇప్పుడు ఈ అంశాన్ని మరింత సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లింది.