Andhra Pradesh: `జనవాణి`కి వైరల్ ఫీవర్ ఎఫెక్ట్
వైరల్ ఫీవర్ అటాక్ కావడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్థారిస్తోంది. ఆ కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం వారం రోజుల పాటు వాయిదా పడింది.
- Author : CS Rao
Date : 21-07-2022 - 11:44 IST
Published By : Hashtagu Telugu Desk
వైరల్ ఫీవర్ అటాక్ కావడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్థారిస్తోంది. ఆ కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం వారం రోజుల పాటు వాయిదా పడింది. జనవాణి కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్ తో పాటు పార్టీలోని కొందరు ముఖ్య నేతలు, కార్యక్రమ కమిటీ సభ్యులు, భద్రతా సిబ్బంది జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జనవాణిని జూలై 24న కాకుండా జూలై 31న నిర్వహిస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనవాణికి సంబంధించిన స్థలం, వేదిక తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రతి ఆదివారం జనవాణి-జనసేన భరోసా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడ, భీమవరంలో ఇప్పటికే మూడు దశల జనవాణి కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలో మరో రెండు కార్యక్రమాలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో కార్యక్రమం వాయిదా పడింది.