AP Power Tariff Hike: ఏపీ ప్రజలకు.. “పవర్”ఫుల్ షాక్..!
- By HashtagU Desk Published Date - 03:39 PM, Wed - 30 March 22

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంట్ షాక్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే పెరిగిన విద్యుత్ జార్జీలు అమల్లోకి రానున్నాయి.
తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. 0-30 యూనిట్ల శ్లాబ్‌కు, యూనిట్ 45 పైసలు పెంచారు. 31-75 యూనిట్ల శ్లాబ్‌కు సంబందించి, యానిట్‌కు 91 పైసలు పెరిగింది. 76-125 యానిట్ల శ్లాబ్‌కు సంబందించి, యానిట్‌కు 1.40 పెంచారు. 126-225 యూనిట్ల శ్లాబ్‌కు సంబందించి, యూనిట్‌కు 1.57 పెంచనున్నారు. 226-400 యానిట్ల శ్లాబ్‌కు సంబందించి, యూనిట్ 1.16 పెంచారు. 400పైన శ్లాబ్‌కు, యూనిట్ కు 55 సైసల చొప్పున పెరుగనుంది.
ఇక డిస్కంలు ప్రతిపాదించని శ్లాబ్ ల్లోనూ ఈఆర్సీ మార్పులు చేసింది. ఈ క్రమంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆదాయమే లక్ష్యంగా విద్యుత్ ఛార్జీజు పెంచినట్లు ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి తెలిపారు. తీయ విద్యుత్ విధానాన్ని అనుసరించే ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. ధరల పెంపు బాధాకరమని చెప్పిన నాగార్జునరెడ్డి కేటగిరీలు రద్దు చేశామన్నారు. డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు నిర్ణయం తీసుకున్నామని, పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఇకపోతే ఇప్పటికే ఓ వైపు పెట్రోల్,డీజిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు మోత మోగుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు పెరగటంతో సామాన్యులపై మరింత భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ఇప్పుడిప్పుడే కాస్త, ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో పేద, మద్యతరగతి ప్రజల నడ్డి విరిచేందుకు జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో రంగం సిద్ధం చేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం ఏమాత్రం పెరగలేదు. మరోవైపు నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలెండర్, పెట్రోల్ అండ్ డీజల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ఇప్పుడు కరెంట్ చార్జీలు కూడా పెంచి అదనపు భారం వేస్తే, సామాన్యులు ఎలా కోలుకుంటారని, ఏపీ ప్రభుత్వంపై పేద, మధ్యతరగతి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.