DSC Notification 2024 : ఇవాళే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ? త్వరలో తెలంగాణలోనూ..
DSC Notification 2024 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
- By Pasha Published Date - 09:48 AM, Sat - 27 January 24

DSC Notification 2024 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు (జనవరి 27) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ, పోస్టుల సంఖ్య, విధి విధానాలను ఆయన అనౌన్స్ చేయనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకుగానూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను మూడు నెలల క్రితమే విద్యాశాఖ సేకరించింది. డీఈఓలు, ఆర్జేడీలు ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేశారు. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. ఈ సమాచారమంతా క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను(DSC Notification 2024) రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువును ఇటీవల ఏపీపీఎస్సీ పొడగించింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఓటీపీఆర్‌తో దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జనవరి 21తో ముగిసింది. గ్రూప్-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని ఏపీపీఎస్సీ డిసైడ్ చేసింది.
Also Read :AP Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖలో 68 జాబ్స్.. 49 అంగన్‌వాడీ జాబ్స్
తెలంగాణలోనూ డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్?
ఇక తెలంగాణలోనూ డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలు సేకరిస్తు్న్నారు. ఈ ఏడాది 3800 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నారు. పదవీ విరమణ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో 5,089 టీచర్ల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కారణంగా రాత పరీక్ష నిర్వహణ నిలిచిపోయింది. దీంతో ఆ నోటిఫికేషన్ కు అనుబంధంగా పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.