AP News : ల్యాండ్ పూలింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP News : ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి , మున్సిపల్ వ్యవహారాల మంత్రి పొంగూరు నారాయణ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
- By Kavya Krishna Published Date - 06:08 PM, Mon - 21 July 25

AP News : ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి , మున్సిపల్ వ్యవహారాల మంత్రి పొంగూరు నారాయణ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రెండో విడత ల్యాండ్ పూలింగ్ (Land Pooling) విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. ఈ అంశంపై రాబోయే కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సబ్ కమిటీ సమావేశంలో అన్ని సూచనలు తీసుకుని ల్యాండ్ పూలింగ్‌పై ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ అన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణంలో ఎదురైన లీగల్, టెక్నికల్ సమస్యలు అన్ని పరిష్కారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. “రైతులు, కాంట్రాక్టర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తాం,” అని నారాయణ తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్టుమెంట్లు అమరావతిలో నిర్మిస్తున్నామని వివరించారు.
ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోందని, వాటి గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని చెప్పారు. నాన్-గెజిటెడ్ అధికారుల టవర్లు కూడా తుది దశలో ఉన్నాయని తెలిపారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో 6 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని, వచ్చే మార్చి 31వ తేదీలోపు అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐకానిక్ టవర్ డిజైన్‌లు దాదాపు పూర్తి అయ్యాయని, ఇవాళ నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వచ్చి టవర్ డిజైన్లపై చర్చ జరుపుతుందని అన్నారు. 75 కంపెనీలకు ఇప్పటికే భూకేటాయింపు జరిగిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు.
గత జగన్ ప్రభుత్వం రైతులు, కాంట్రాక్టర్లను అనవసరంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి అమరావతిని వేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం, అని నారాయణ విమర్శించారు.
Parliament : జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్‌సభ, రాజ్యసభ, ఎంపీల నోటీసులు.