Adani Group Invest In AP: ఆంధ్రప్రదేశ్ లో అదానీ గ్రూప్ పెట్టుబడులు
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రతినిధి బృందం సమావేశం; వివిధ రంగాల్లో ప్రాజెక్టుల ప్రతిపాదనలు చర్చించబడినాయి.
- By Kode Mohan Sai Published Date - 12:01 PM, Tue - 29 October 24

Adani Group Invest In AP: అదానీ గ్రూప్, రాష్ట్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, డేటా సెంటర్‌లు, కృత్రిమ మేధ, ఐటీ, గనులు, పోర్టులు, పర్యాటకం వంటి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని కంపెనీ పేర్కొంది. అదానీ గ్రూప్, స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపించింది.
అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి, ఆ రాష్ట్రంలో తమ పెట్టుబడుల గురించి వివరించారు. అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్న రంగాలను గుర్తించి, వాటిలో ఎంత మేరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో తెలియజేశారు. ప్రభుత్వ సహాయం కోసం అవసరమైన అంశాలను కూడా స్పష్టం చేశారు.
అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టుల పరిశీలనకు రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు రాక రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారే అవకాశాలపై దృష్టి పెట్టారు. చంద్రబాబు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేందుకు మార్గదర్శకంగా ఉంటుందని వివరించారు.
Met with a delegation from the Adani Group led by the MD of Adani Exports Ltd., Mr Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Ltd., Mr @AdaniKaran, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation covered projects with the potential to…
— N Chandrababu Naidu (@ncbn) October 28, 2024
అదానీ గ్రూప్ కీలక ప్రతిపాదనలు:
అదానీ సంస్థ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) నిర్మాణాన్ని పూర్తిగా స్వయంగా చేపట్టేందుకు సిధ్ధంగా ఉందని ప్రకటించింది. ఇప్పటికే సిద్ధం చేసిన ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పేర్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆధారంగా ఐఆర్‌ఆర్‌ను ఫేజ్-1, ఫేజ్-2గా విభజించే ప్రతిపాదనను అందించింది.
ఈ ప్రాజెక్టు భాగంగా భవానీ ద్వీపం, రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలిపి రోప్‌వే నిర్మాణం చేపడతామంది. ట్రాఫిక్ అధ్యయనం చేసిన తరువాత అవసరమైతే అదనపు స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అత్యుత్తమ రోప్‌వే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ & ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ మోడల్ ద్వారా విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకు 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.800 కోట్ల పెట్టుబడిని మునుపే ప్రకటించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేయడానికి అవసరమైన టెక్నాలజీతో పాటు, మంచి నీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీ వినియోగించనున్నామని వివరించింది.
కృష్ణపట్నం, గంగవరం పోర్టుల విస్తరణకు అదానీ గ్రూప్ ప్రతిపాదనలు:
అదానీ గ్రూప్, కృష్ణపట్నం పోర్టు సామర్థ్యాన్ని 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 13 బెర్తుల సంఖ్యను 42కి విస్తరించాలని ప్రకటించింది. ఈ విస్తరణ కోసం 2189.86 ఎకరాల భూమి అవసరమని, అందులో 1033 ఎకరాల అటవీ భూమికి మొదటి దశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మారిటైం బోర్డుకు ప్రతిపాదన పంపించింది, డీపీఐఐటీ ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదనంగా, దేవాదాయ భూముల 289.69 ఎకరాలపై హైకోర్టులో జరుగుతున్న వివాదం పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది.
గంగవరం పోర్టు సామర్థ్యాన్ని 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచాలని ఉద్దేశిస్తోంది. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూములను ఆపేరుతో ఉండేలా భూమి రికార్డులను మార్చాలని కోరింది. గతంలో కేటాయించిన 1800 ఎకరాల్లో 217.57 ఎకరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని తమకు అప్పగించాలని తెలిపింది. ఏపీఐఐసీ ద్వారా 5000 నుంచి 20,000 ఎకరాల భూమి కేటాయిస్తే, దేశంలోనే అతి పెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామిక పార్కుల విస్తరణకు అవకాశం ఉందని స్పష్టం చేసింది.
బీచ్‌శాండ్ ప్రాజెక్టు: పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు
బీచ్‌శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులకు తొలి దశలో రూ.3000 కోట్ల నుంచి రూ.4000 కోట్ల పెట్టుబడిని కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 4000 నుండి 5000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించబడుతాయని తెలిపింది. విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టుల్లో మొత్తం రూ.15,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది, దీని ద్వారా ప్రత్యక్షంగా 4000 మందికి, పరోక్షంగా 8000 నుండి 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టంచేసింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 30 సంవత్సరాల కాలంలో రూ.10,000 కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది. టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించడం ద్వారా రూ.9000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు. మౌలిక సౌకర్యాల అభివృద్ధి, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యా కేంద్రాలు మరియు వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు.
ప్రాజెక్టులకు రాయితీలు మరియు అభ్యర్థనలు:
ఈ మేరకు, వందశాతం ఎస్‌జీఎస్టీ, వ్యాట్ రీఎంబర్స్‌మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించినా, పదేళ్లపాటు కరెంట్ సుంకంపై 100% మినహాయింపును కోరింది. టైటానియం డయాక్సైడ్ ప్రాజెక్టుకు అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రంగంలో అభివృద్ధి మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల అవకాశాలకు అనుగుణంగా విద్యుత్ రాయితీ అందించాలని కోరింది. ప్రాజెక్టు పదేళ్ల పాటు విజయవంతంగా అమలైన తర్వాత భూమి కొనుగోలు ఎంపిక, స్థిర మూలధన పెట్టుబడి-ఎఫ్‌సీఐ రాయితీ, టెర్మ్‌రుణాలపై పదేళ్లపాటు వడ్డీ రాయితీ, మరియు పెట్టుబడి వ్యవధికి వందశాతం స్టాంపు రుసుము మినహాయింపును అందించాలని కోరింది. అదేవిధంగా, ఇళ్లకు ఉచితంగా నీరు, విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేయాలని, దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్ సుంకం రద్దు చేయాలని మరియు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని అభ్యర్థించింది.
డిజిటల్ మరియు పునరుత్పాదక రంగాలు కలిసి పనిచేయడం వల్ల రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో 17 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు సృష్టించగలవని తమ ప్రణాళికలో వెల్లడించింది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఫిల్మ్ మేకింగ్ మరియు పునరుత్పాదక విభాగాల్లో ఈ అవకాశాలున్నాయని వివరించింది. ప్రముఖ గూగుల్ సంస్థ, తన డేటా సెంటర్ల విస్తరణ కోసం భారత్‌లో అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నది. వారు నిర్దేశించిన ప్రాతిపదికలకు విశాఖపట్నం సరిపోతుందని, కానీ కాపీరైట్ చట్టాలు, పన్నుల చట్టాలు మరియు చట్టబద్ధమైన యాక్సిస్‌కు సంబంధించి కొన్ని సవరణలు కోరుతున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల అభివృద్ధి:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు హైపర్‌స్కేలర్స్ కోసం డేటా సెంటర్లు, వివిధ దేశాలకు డేటా ఎంబసీల నిర్మాణానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అదానీ సంస్థ పేర్కొంది. హైపర్‌స్కేలర్స్‌ను ఆకర్షించడానికి గిగావాట్‌ల గ్రీన్ ఎనర్జీ అవసరమని, సముద్ర గర్భంలో కేబుల్ కనెక్టవిటీ మరియు టాలెంట్ బ్యాంకు ఉండాలి అని వివరించింది. 2032 నాటికి విద్యుత్ అవసరాలు పెరుగుతుండటంతో, 9013 మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరమవుతుందని తెలిపింది.
ఈ అవసరాలను తీర్చేందుకు 4000 మెగావాట్ల సౌర విద్యుత్, 4000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాత ఏఐ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలనుకుంటున్నట్టు తెలిపింది. దీనికి అనుబంధంగా ప్రతి సంవత్సరం 50,000 మంది విద్యార్థులకు శిక్షణ అందించేందుకు సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ మరియు ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు యూనివర్శిటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఈ ప్రాజెక్టులకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు ఉండాలని, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలని కోరింది. టాప్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు స్కాలర్‌షిప్‌లు మరియు ఇన్సింటివ్స్ ప్రకటించాలని కూడా అదానీ సంస్థ తన ప్రతిపాదనలో స్పష్టం చేసింది.