Vijayawada : హైదరాబాద్ తో పోటీ పడుతున్న విజయవాడ..ఎందులో అనుకుంటున్నారు..?
Vijayawada : విజయవాడ 100 ఫీట్ల రోడ్డులో భూముల ధరలు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి
- By Sudheer Published Date - 10:11 AM, Sun - 2 March 25

Vijayawada Real Estate : ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి (Amaravathi) రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోనే కాకుండా విజయవాడలో కూడా రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. గతంలో మూడు రాజధానుల అంశం రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్‌ను కుదిపేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటించడంతో భూముల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ 100 ఫీట్ల రోడ్డులో భూముల ధరలు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. కొన్నిరోజుల కిందట అక్కడ ఒక ఎకరం భూమి రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్య పరచగా, ఇప్పుడు తాజాగా మరో స్థలం రూ. 35 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
విజయవాడలో రియల్ ఎస్టేట్ బూమ్ మళ్లీ కొత్త దశలోకి వెళ్లిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అమరావతి అభివృద్ధి పునరుద్ధరణతో పాటు, విజయవాడ వ్యాపార కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ భూములపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇంత భారీ ధరలకు కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించబోతున్నారో అనే అంశంపై నగరవాసుల మధ్య చర్చ మొదలైంది. బిల్డింగులు, కమర్షియల్ ప్రాజెక్టులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటి వ్యాపార కేంద్రీకరణ కోసం ఈ స్థలాలను వాడతారా.. లేక మరేదైనా భారీ ప్రాజెక్ట్‌లు కట్టబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Meenakshi Natarajan : మీనాక్షి మార్క్.. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో మారిన లెక్క
ఇదిలా ఉండగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి విజయవాడ పోటీగా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భూముల ధరలు ఇప్పటికే అమాంతంగా పెరిగిన నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఇప్పుడు విజయవాడ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడలో రోడ్డు మార్గాల అభివృద్ధి, రైల్వే, విమానాశ్రయ సౌకర్యాల అభివృద్ధితో పాటు, అమరావతికి సమీపంగా ఉండటం వలన భవిష్యత్తులో ఈ నగరం మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుందని అంచనా వేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి భారీ పెట్టుబడులు సాధారణ వ్యాపారులకు మళ్లీ భారమవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో రియల్ ఎస్టేట్ రంగం ఇంత వేగంగా అభివృద్ధి చెందడం ద్వారా అక్కడ వ్యాపార కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ఒక వర్గం చెబుతుంటే, మరొక వర్గం మాత్రం సాధారణ ప్రజలకు ఇళ్ల కొనుగోలు మరింత కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా, అమరావతి రాజధాని పనులు వేగవంతం కావడంతో విజయవాడ రియల్ ఎస్టేట్ రంగం కొత్త దశలోకి ప్రవేశించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
CMO Vs PCCF: సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్.. ఐఎఫ్ఎస్ అధికారుల టూర్‌పై వివాదం