Sun Explosion : సూర్యుడిపై భారీ విస్ఫోటం.. 8 గంటలు సౌర తుఫాను కలకలం!
భూమిపై ఉండే అగ్ని పర్వతాలు బద్దలైతే.. చూడటానికి చాలా డేంజరస్ సీన్స్ ఉంటాయి. పరిసర ప్రాంతాల్లో హాహాకారాలు మిన్నంటుతాయి.
- By Hashtag U Published Date - 06:00 PM, Wed - 15 June 22

భూమిపై ఉండే అగ్ని పర్వతాలు బద్దలైతే.. చూడటానికి చాలా డేంజరస్ సీన్స్ ఉంటాయి. పరిసర ప్రాంతాల్లో హాహాకారాలు మిన్నంటుతాయి. లావా ప్రవహించిన చోటల్లా బూడిద కుప్పలే మిగులుతాయి!! మరి సూర్యుడిపై ఉండే నల్ల మచ్చ (సన్ స్పాట్స్) ల్లో విస్ఫోటనాలు జరిగితే.. సౌర తుఫానులు సంభవిస్తాయి. సమీపంలో ఉండే భూమి, పలు గ్రహాల వాతావరణ పొరల వైపు సౌర తుఫాను అలలు దూసుకొస్తాయి. తాజాగా జూన్ 13వ తేదీన వేకువ జామున సూర్యుడిపై ఉండే “AR3032” సన్ స్పాట్ లో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. సూర్యుడిపై నిఘా కోసం మోహరించిన వ్యోమ నౌకలు “సోలార్ అండ్ హీలియో స్పియరిక్ అబ్జర్వేటరీ” (సోహో), “సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ”(ఎస్డీఓ) అనే వ్యోమనౌకలు ఈ సౌర తుఫాను, సన్ స్పాట్ పేలుళ్లకు వీడియోను చిత్రీకరించి భూమికి పంపాయి. దాదాపు 8 గంటలపాటు ఈ సౌర తుఫాను ఆగకుండా కొనసాగింది.సూర్యుడి వాతావరణంలో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మా .. గంటకు కొన్ని మిలియన్ల కిలోమీటర్ల వేగంతో భూమి తో పాటు పలు గ్రహాలవైపు దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సౌర తుఫాను కారణంగా జూన్ 13న జపాన్ , ఇతర ఆగ్నేయ ఆసియా దేశాల్లో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థకు చెందిన షార్ట్ వేవ్ రేడియో తరంగాల ప్రసారానికి విఘాతం కలిగింది.30 హెర్ట్జ్ ల కంటే తక్కువ పౌన పున్యం కలిగిన ఫ్రీక్వెన్సీల ప్రసారానికి ఈ సౌర తుఫాను ఆటంకాన్ని సృష్టించింది.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ..
ఇంకొన్ని రోజులు కూడా ఈ సౌర తుఫాను ప్రభావం కొనసాగొచ్చని పుణె లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ పరిశోధకులు చెబుతున్నారు. జూన్ 15న సెకనుకు 645 నుంచి 922 కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమికి అత్యంత ఎగువన ఉండే అయానో స్పియర్ ను తాకొచ్చని పేర్కొన్నారు. ఈమేరకు వివరాలతో ఆ సంస్థ ఒక ట్వీట్ చేసింది.