Liquor Door Delivery : ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో మద్యం డోర్ డెలివరీ.. దేశంలో తొలిసారిగా ఎక్కడంటే..!
కాస్త తీర్థం పుచ్చుకోవాలన్న కోరిక రావాలే కాని.. ఆ చుక్క నోట్లో పడేవరకు మందుబాబులకు మనసు అస్సలు ఆగదు.
- By Hashtag U Published Date - 04:00 PM, Fri - 3 June 22

కాస్త తీర్థం పుచ్చుకోవాలన్న కోరిక రావాలే కాని.. ఆ చుక్క నోట్లో పడేవరకు మందుబాబులకు మనసు అస్సలు ఆగదు. అందుకే ఎంత వేగంగా వైన్ షాప్ కి వెళ్లి.. ఎంత వేగంగా కావలసిన బ్రాండ్ కొనుక్కుందామా.. ఓ పెగ్గు వేసేద్దామా అన్నట్టుగా ఉంటుంది వారి వ్యవహారం. కానీ ఒక్కోసారి షాప్ ముందు భారీగా క్యూ ఉంటుండడంతో.. అప్పటివరకు వెయిట్ చేయలేక.. గొంతులో పెగ్గు పోసుకోలేక నానా కష్టాలూ పడుతుంటారు. అందుకే అలాంటివారికోసం మద్యం హోమ్ డెలివరీని ప్రారంభించింది ఓ సంస్థ. జస్ట్ మీరు అలా ఆర్డర్ చేస్తే.. ఇలా పది నిమిషాల్లో మీరు కోరిన బ్రాండ్లను మీకు డెలివరీ చేస్తుంది.
ఈ 10 నిమిషాల్లో డోర్ డెలివరీ సదుపాయం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఫస్ట్ టైమ్ పశ్చిమబెంగాల్ లో స్టార్ట్ చేసింది ఓ స్టార్టప్ కంపెనీ. దీని పేరు ఇన్నొవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ‘బూజీ’ బ్రాండ్ పేరుతో మద్యాన్ని డెలివరీ చేస్తోంది. ప్రస్తుతానికి కోల్ కతాలో ఈ సర్వీస్ ఇస్తోంది. నిజానికి చాలా కంపెనీలు ఇప్పటికే మద్యాన్ని ఆన్ లైన్ డెలివరీ చేస్తున్నాయి. కాకపోతే ఈ సంస్థ మాత్రం కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెప్పడంతో మందుబాబుల ఆనందానికి అంతే లేదు.
దేశంలో ఇలా వేగంగా సప్లయ్ చేసే తొలి సంస్థ తమదే అని ఆ కంపెనీవాళ్లు చెబుతున్నారు. ఎప్పుడైనా పార్టీ చేసుకోవాలనుకున్నా.. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కావలసిన బ్రాండ్ రెడీ అని మద్యం ప్రియులు కూడా సంబరపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి ఈ సంస్థ ఇప్పటికే అనుమతులు తీసుకుంది. సేవలను కూడా ప్రారంభించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ దగ్గర ఎప్పుడు ఈ సర్వీసు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు.