International Tiger Day 2023 : ది టైగర్.. మన జాతీయ జంతువును కాపాడుకుందాం!
గ్లోబల్ (International) టైగర్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 29 న జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది.
- By Pasha Published Date - 10:21 AM, Sat - 29 July 23

International Tiger Day 2023 : పులుల గురించి మనకు తెలిసింది తక్కువే..
అది మన జాతీయ జంతువు..
ప్రపంచంలోని 13 దేశాలలో మాత్రమే పులులు ఉన్నాయి..
ప్రపంచంలోని పులుల్లో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి..
2010 నాటికి మన దేశంలోని పులుల సంఖ్య అంతరించిపోయే దశకు చేరుకుంది.
అయితే ఇప్పుడు మళ్ళీ వేగంగా పెరుగుతోంది.
పులులను సంరక్షించడానికి, వాటి జాతులు అంతరించిపోకుండా కాపాడేందుకు ఏటా జులై 29న “ప్రపంచ పులుల దినోత్సవాన్ని” జరుపుకుంటారు.
Also read : New Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టులో పలు కంపెనీల కొత్త కార్లు విడుదల..!
2010 సంవత్సరం నాటికి మన దేశంలోని పులుల సంఖ్య 1,700కి చేరుకుంది. దీంతో మన జాతీయ జంతువు ఇక అంతరించిపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. ఈక్రమంలో ఆ ఏడాది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పులుల సంరక్షణపై శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈ మీటింగ్ లోనే డిసైడ్ చేశారు. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఈ మీటింగ్ లో పాల్గొన్న దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. కట్ చేస్తే.. 2018 లెక్కల ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య 2967కి పెరిగింది. కేరళ, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పులుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్లకోసారి పులుల గణన జరుగుతోంది. 2022 సంవత్సరంలో జరిగిన తాజా జాతీయ పులుల గణన ప్రకారం.. మన దేశంలో 3,167 పులులు ఉన్నాయి. అంటే 2018 నాటితో పోలిస్తే పులుల సంఖ్య దాదాపు 6.7 శాతం పెరిగింది. మధ్య భారతదేశం, తూర్పు కనుమలు, ఈశాన్య కొండలు, బ్రహ్మపుత్ర మైదానాలలో పులుల జనాభాలో పెరుగుదల కనిపించింది. 1973 నాటికి మన దేశంలో కేవలం 9 పులుల సంరక్షణ కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 51కి పెరిగింది. గ్లోబల్ టైగర్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 29 న (International Tiger Day 2023) జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. ప్రపంచంలోని పులుల్లో 95 శాతం గత 100 ఏళ్ళ వ్యవధిలో అంతరించిపోవడం గమనార్హం.
మన దేశంలో టైగర్ రిజర్వ్ లు ఎక్కడున్నాయో తెలుసా ?
- బందీపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక : ఇది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉంది. ఇందులో బెంగాల్ పులులతో పాటు చిరుతపులి, ఆసియా అడవి ఏనుగు, సాంబార్ జింకలు ఉన్నాయి.
- రణథంబోర్ టైగర్ రిజర్వ్ , రాజస్థాన్ : ఇది రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది. ఇందులో ఉన్న పులులను చూసేందుకు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.
- సుందర్‌బన్ టైగర్ రిజర్వ్, పశ్చిమ బెంగాల్ : ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడికి కేవలం పడవలో మాత్రమే వెళ్ళగలం. అక్టోబరు నుంచి మార్చి మధ్యకాలంలో దీన్ని విజిట్ చేయొచ్చు.
- బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ : ప్రపంచంలోనే అత్యధిక పులుల జన సాంద్రత కలిగిన ప్రాంతం ఇది. ఈ టైగర్ రిజర్వ్ 105 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది.
- తడోబా-అంధారి టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర : ఇందులో 115 పులులు ఉన్నాయి. ఈ రిజర్వ్ లో సఫారీ వసతి కూడా ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also read : ITR Filing: జూలై 27 నాటికి 5 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు.. మరో 72 గంటలు మాత్రమే ఛాన్స్..!