Logistics Sector: దేశంలో వేగంగా విస్తరిస్తోన్న లాజిస్టిక్స్ రంగం!
Logistics Sector: లాజిస్టిక్స్ రంగం మన దేశంలో అత్యంతవేగంగా విస్తరిస్తోంది.అటు ఆర్థిక వ్యవస్థలోను, ఇటు ఉద్యోగ కల్పనలో కూడా ఈ రంగం పాత్ర కీలకంగా ఉంది. లాజిస్టిక్స్ అనేది ఆన్ లైన్ వ్యాపారం-ఇ-కామర్స్ తో ముడిపడి ఉంటుంది.
- By Anshu Published Date - 07:51 PM, Sun - 9 October 22
Logistics Sector: లాజిస్టిక్స్ రంగం మన దేశంలో అత్యంతవేగంగా విస్తరిస్తోంది.అటు ఆర్థిక వ్యవస్థలోను, ఇటు ఉద్యోగ కల్పనలో కూడా ఈ రంగం పాత్ర కీలకంగా ఉంది. లాజిస్టిక్స్ అనేది ఆన్ లైన్ వ్యాపారం-ఇ-కామర్స్ తో ముడిపడి ఉంటుంది. వినియోగదారుడు ఒక వస్తువుని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన తరువాత ఆ వస్తువు ఆ వినియోగదారుడికి చేరేవరకు జరిగే ప్రక్రియ అంతా లాజిస్టిక్ కిందకే వస్తుంది. దీనినే 3పీఎల్ అంటే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అని అంటారు. వస్తువు ఉత్పత్తిదారుడు లేదా అమ్మకందారుడుకి, కొనుగోలుదారుడు లేదా వినియోగదారుడికి మధ్య జరిగే కార్యకలాపాల మొత్తాన్ని నిర్వహించే వ్యవస్థే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటారు. అంటే వస్తువులను నిల్వ చేయడం, ప్యాకింగ్, లేబులింగ్, బిల్లింగ్, నగదు లావాదేవీలు, రోడ్డు, జల,వాయు మార్గంలో రవాణా చేయడం ద్వారా కొనుగోలుదారుడు లేదా వినియోగదారుడికి చేర్చడం, వస్తు మార్పిడి, తిరిగి తీసుకోవడం వంటి ప్రక్రియ మొత్తాన్ని థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అని చెప్పవచ్చు. ఇ- కామర్స్, లాజిస్టిక్స్ చట్టాలు, వ్యాపారం జరిగే ప్రాంతం,రోడ్ల పరిస్థితి, రవాణా… తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఒక పార్సిల్ ను వేగంగా, సురక్షితంగా, చెప్పిన తేదీకి అందించడం కూడా ముఖ్యం. వినియోగదారుడికి ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్ లైన్ పేమెంట్ ఆన్ డెలివరీ వంటి చెల్లింపులకు అవకాశం కల్పించాలి.
ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో, ఎంత వేగంగా అభివృద్ది చెందుతుందో మనందరికీ తెలుసు. మన దేశంలో ఆన్ లైన్ వ్యాపారంలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలదే ప్రధాన పాత్రగా ఉంటుంది. 2025 నాటికి దేశంలో మొత్తం లాజిస్టిక్స్ ఆదాయంలో 30 శాతం ఈకామర్స్ లాజిస్టిక్ కంపెనీల నుంచే వస్తుందని అంచనా. ఇ- కామర్స్ కంపెనీకి లాజిస్టిక్స్ నిర్వహణ అనేది గొప్ప సవాల్. అధిక జనాభా గల మనలాంటి దేశంలో దీని నిర్వహణకు ఎంతో సామర్థ్యం కావాలి. ఇ-కామర్స్ విస్తరించడానికి కూడా మన దేశంలో అవకాశాలు ఎక్కువ. దాంతో కొత్తకొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఉన్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సాంకేతికత వినియోగించవలసి ఉంటుంది. దీనికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ కావాలి. అయితే, వర్షాకాలం, ప్రకృతి వైపరీత్యాల వంటి విపత్కర పరిస్థితులలో, వంతెనలు దెబ్బతిన్నప్పుడు నిర్ణీత సమయానికి వినియోగదారులకు వస్తువులను అందించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇ- కామర్స్ లేదా ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతుండటంతో వస్తువులు ఎక్కువగా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరుతున్నాయి. అంటే డీలర్లు,పంపిణీదారులు, చిల్లరవ్యాపారుల పాత్ర చాలావరకు తగ్గిపోతోంది. దాంతో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగింది. ఇ-కామర్స్ కంపెనీలే ఎక్కువ భాగం లాజిస్టిక్స్ వ్యవస్థను కూడా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఇ-కామర్స్ అనేది చాలా విస్తృతమైంది.
మన దేశంలో పది కోట్ల మందికి పైగా తమకు కావలసిన వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులను ఆన్ లైన్ షాపింగ్ కు ఆకర్షించడానికి ఇ-కామర్స్ కంపెనీలు తక్కువ డెలివరీ ఖర్చు,వేగంగా డెలివరీ,తిప్పి పంపించే అవసరం రాకుండా ఉండటం, వినియోగదారుడికి సంతృప్తికరంగా సేవలందించడం ముఖ్యం.
ఇ-కామర్స్ వ్యాపారం,వినియోగదారులకు అందించే సేవలు,సాఫ్ట్ వేర్ వినియోగం,వ్యాపారంచేసే స్థాయి, ఉన్న వనరుల ఆధారంగా కొన్ని
లాజిస్టిక్స్ కంపెనీలను గుర్తించారు. డెలివరీ ఖర్చులు, ఎన్ని పిన్ కోడ్ ప్రాంతాలకు అందించగలుగుతున్నారు, ట్రాకింగ్ అప్ డేట్,డెలివరీ వేగం, సేవా నిబంధనలు, తిరిగి తీసుకోవడం,ప్రత్యేక రవాణా సేవలు, సురక్షితంగా డెలివరీ చేయడం వంటి అంశాలపై ఆధారపడి ఒక కంపెనీని ఇ-కామర్స్ లో ఉత్తమమైన లాజిస్టిక్స్ కంపెనీగా గుర్తిస్తారు. ప్రస్తుతం మన దేశంలో 150కి పైగా లాజిస్టిక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. వాటిలో టాప్ 10 కంపెనీల పనితీరును పరిశీలిద్ధాం. మన అవసరాలకు ఏ కంపెనీని ఎంచుకోవాలో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
మన దేశంలో బ్లూ డార్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ మొదటి స్థానంలో ఉంది. 1983లో స్థాపించిన ఈ సంస్థకు దేశవిదేశాల్లో భారీ నెట్ వర్క్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 220కి పైగా దేశాల్లో ఇది విస్తరించింది. మనదేశంలో 35 వేల పిన్ కోడ్ ప్రాంతాలకు ఇది వస్తువులను అందిస్తోంది. ఒక్క మన దేశంలోనే దీనికి 12,200 మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2,75,000 మంది ఉన్నారు. వినియోగదారులకు అనేక సౌకర్యాలు అందించడంవల్ల ఇది ఈ స్థాయికి చేరింది. దేశంలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీవెరీ ఇ-కామర్స్ లాజిస్టిక్స్ భారతీయ కంపెనీ. 2011లో ప్రారంభించిన ఈ సంస్థ నిర్వహణలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సంస్థ దేశంలో 7,500కుపైగా ప్రాంతాలలో ఇ-కామర్స్ నిర్వహిస్తోంది. డెలివరీ అదే రోజు లేదా మరుసటి రోజు, క్యాష్ ఆన్ డెలివరీ వంటి సేవలలో ఈ సంస్థకు మంచి పేరుంది. ఇది 18 వేల ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. ఉద్యోగులు పదివేల మందికి పైగా ఉన్నారు.
మూడవ స్థానంలో ఉన్న ఫెడెక్స్ ఇ-కామర్స్ వ్యాపారంలోకి రాకముందే లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ మార్కెట్ లో మంచి పేరు తెచ్చుకుంది. 1971లో ప్రారంభమైన ఈ సంస్థకు అత్యంత బరువైన, బరువు తక్కువ గల, ఖరీదైన వస్తువులు, లిథియం బ్యాటరీల వంటి ప్రమాదకరమైన వస్తువుల రవాణాలో శిక్షణ పొందిన సిబ్బందితో అగ్రశ్రేణి రవాణా సేవలకు మంచి పేరుంది. కస్టమ్స్ క్లియరెన్స్ చేయించడంలో కూడా వీరు సహాయం చేస్తారు. ఇది 200 పైగా దేశాలలో డెలివరీ చేయగలదు. డెలివరీకి సంబంధించి వినియోగదారులకు ఎప్పటికప్పుడు స్టేటస్ ని లైవ్ లో అప్ డేట్ చేస్తుంది. డెలివరీ వేగంగా చేయడంలో కూడా దీనికి మంచి పేరుంది. మన దేశంలో ఆరు వేలకుపైగా ప్రదేశాలలో ఇది డెలివరీ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 4 లక్షల 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.ఎకార్డ్ లాజిస్టిక్స్ అనేది 4వ స్థానంలో ఉంది. 2009లో ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని 13 నగరాల్లో ఒకే రోజు డెలివరీని ప్రారంభించింది. 50 నగరాల్లో మరుసటి రోజు డెలివరీని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్ కార్డ్ వంటి ఇ-కామర్స్ వ్యాపారుల లాజిస్టిక్ సమస్యలను ఇది పరిష్కరిస్తోంది. దేశంలో 3,800లకు పైగా పిన్ కోడ్ ప్రాంతాలకు ఇది డెలివరీ చేస్తోంది. 500 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పని చేస్తారు.
ఇక 1969లో ప్రారంభించిన జర్మనీకి చెందిన డీహెచ్ఎల్ లాజిస్టిక్స్ కంపెనీ 5వ స్థానంలో ఉంది. ఇది మనదేశమంతటా విస్తృతంగా తన సేవలందిస్తోంది. నెట్ వర్క్ డెలివరీలో వ్యయాన్ని తగ్గించడానికి ఇది చాలా కృషి చేసింది. దీనికి ప్రపంచంలో మొత్తంలో 800కి పైగా కేంద్రాలు ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో గోడౌన్లు ఉన్నందున లాజిస్టిక్ ఖర్చులు తక్కువతో వినియోగదారులకు అందిస్తోంది. ఇది ప్రపంచలోని 220కిపైగా దేశాలతో పాటు మన దేశంలో 26వేలకు పైగా పిన్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. ఇందులో పని చేసే ఉద్యోగుల సంఖ్య మన దేశంలో 21 వేలు కాగా, ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 85వేల మంది ఉన్నారు.
2012లో స్థాపించిన ఇ-కామర్స్ ఎక్స్ ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ దేశంలోని ఆన్ లైన్ వ్యాపారులకు ఇ-కామర్స్ లాజిస్టిక్ సేవలందిస్తోంది. ఆభరణాల వంటి విలువైన వస్తువుల డెలివరీలో ఇది అదనపు భద్రత కల్పిస్తుంది. ఇది ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పనిచేస్తోంది. ఆర్డర్ బుక్ చేసిన 72 గంటల లోపల ఇది డెలివరీ చేస్తుంది. ఇది దేశంలో 27వేలకుపైగా పిన్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. దీని ఉద్యోగుల సంఖ్య 36 వేలకుపైగా ఉంటారు. ఇ-కామర్స్ లాజిస్టిక్స్ కోసం షాడోఫాక్స్ కంపెనీని 2015లో స్థాపించారు. ఇది దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశంలోనూ వందలాది బ్రాండ్లకు లాజిస్టిక్స్ సేవలందిస్తోంది. వేగవంతంగా డెలివరీ చేయడంతో ఇది బాగా ప్రసిద్ధి పొందింది. క్యాష్ ఆన్ డెలివరీతోపాటు, డెలివరీ చేసే సమయంలో నగదు రహిత చెల్లింపులను కూడా అనుమతిస్తారు. ఈ కంపెనీ దేశంలోని ఏడువేలకు పైగా పిన్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. దీని ఉద్యోగుల సంఖ్య లక్షా 50వేల మందికి పైగానే ఉంటారు.
దేశంలో 8వ స్థానంలో ఉన్న ఎక్స్ ప్రెస్ బీస్ కంపెనీని కూడా 2015లోనే స్థాపించారు. లాజిస్టిక్స్ లో ఇది షాడోఫాక్స్ కంపెనీకి పోటీదారుగా వ్యవహరిస్తోంది. డెలివరీ వేగంగా జరిపేందుకు ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 100కు పైగా పంపిణీ కేంద్రాలతోపాటు 2,800కు పైగా కార్యాలయాలు ఉన్నాయి. ఇది ఫార్మా కంపెనీల నుంచి మెషినరీ వంటి హెవీవెయిట్ వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కస్టమ్స్ క్లియరెన్స్ లో కూడా ఇది సహాయపడుతోంది. ఇది దేశంలో 13వేలకు పైగా పిన్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. దీని ఉద్యోగుల సంఖ్య 30వేలకు పైగా ఉంటారు.
దేశంలో 9వ స్థానంలో ఉన్న గతి సంస్థ 1989లో లాజిస్టిక్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇది 17వేలకు పైగా పిన్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేస్తోంది. ఇది వివిధ రకాల లాజిస్టిక్ సేవలు అందిస్తోంది. 1990లో బెంగుళూరులో స్థాపించిన డెస్క్ టు డెస్క్ కొరియర్ అండ్ కార్గో (డీటీడీసీ)ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ దేశంలో పదవ స్థానంలో ఉంది. ఇది 17,500కుపైగా పిన్ కోడ్ ప్రాంతాలలో లాజిస్టిక్ సేవలందిస్తోంది. దీని వినియోగదారుల్లో దాదాపు 75 శాతం మంది ఇ-కామర్స్ వ్యాపారానికి చెందినవారే. ఇది వేర్ హౌసింగ్, క్యాష్ ఆన్ డెలివరీ సేవలను కూడా అందిస్తోంది. అదేరోజు,మరుసటి రోజు డెలివరీ, వేగవంతమైన డెలివరీలో దీనికి మంచి పేరుంది. దీనికి విలువైన, బరువైన, ప్రమాదకరమైన వస్తువులను డెలివరీ చేయడంలో కూడా మంచి అనుభవం ఉంది.
వీటి తరువాత స్థానాల్లో డంన్జో, ఇండియా పోస్టు, సేఫ్ ఎక్స్ ప్రెస్, వావ్ ఎక్స్ ప్రెస్,రివిగో వంటి లాజిస్టిక్ సంస్థలు ఉన్నాయి. ఇవి కూడా దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సేవలందిస్తాయి. సాధారణంగా ఉత్తమ లాజిస్టిక్స్ కంపెనీని ఎన్నుకునేటప్పుడు డెలివరీ ఖర్చులు, పిన్ కోడ్ ప్రాంతంలో డెలివరీ, ట్రాకింగ్ లైవ్,డెలివరీ వేగం, తిరిగి తీసుకోవడం, క్యాష్ ఆన్ డెలివరీ, సురక్షితంగా డెలివరీ చేయడం, అవి అందించే ఇతర సేవలను పరిగణనలోకి తీసుకుంటారు. మన జాతీయ లాజిస్టిక్స్ పాలసీ కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రంగం బాగా విస్తరించడానికి అవకాశం ఏర్పడింది.