China : చైనా జెట్ పైలట్ కవ్వింపు.. ఆస్ట్రేలియా నిఘా విమానం ఇంజిన్‌లోకి చొచ్చుకెళ్లిన అల్యూమినియం ముక్కలు
దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన చైనా, ఆస్ట్రేలియా మధ్య అగాధాన్ని మరింత పెంచుతోంది.
- By Hashtag U Published Date - 11:07 AM, Mon - 6 June 22

దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన చైనా, ఆస్ట్రేలియా మధ్య అగాధాన్ని మరింత పెంచుతోంది. “ఆ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న మా విమానానికి అతి సమీపంలోకి చైనా యుద్ధ విమానం వచ్చింది. చైనా పైలట్ చేసిన ఆ విన్యాసం ఎంతో ప్రమాదకరమైంది. చైనీస్ విమానం తమ నిఘా విమానం ముందు నుంచి వెళ్తూ ఒక్కసారిగా నిప్పులు వెదజల్లింది” అని ఆస్ట్రేలియా ఆరోపణలు చేసింది. చైనా విమానం ‘చాఫ్’ అనే యాంటీ రాడార్ డివైస్‌ను విడుదల చేయడం వల్ల వెలువడిన మంటలు, అందులోని చిన్నచిన్న అల్యూమినియం ముక్కలు ఆస్ట్రేలియా విమానం ఇంజన్‌లోకి చొచ్చుకెళ్లాయని తెలిపింది. ఫలితంగా అందులోని సిబ్బంది భద్రతకు ముప్పు కలిగించిందని , అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించింది. సముద్ర తీరంలో నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా పహారా కాస్తున్న రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ పీ-8 నిఘా విమానాన్ని మే 26న చైనాకు చెందిన జె-16 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అడ్డుకుందని స్వయంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్ వెల్లడించారు. ” దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దశాబ్దాలుగా సముద్ర నిఘా కార్యకలాపాలను చేపట్టాం. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలాలు, గగనతలంలో నావిగేషన్ చేసే స్వేచ్ఛను ఉపయోగించుకునే హక్కు మాకు ఉంది” అని ఒక ప్రకటనలో ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ ఘటనపై బీజింగ్ ఇంకా స్పందించలేదు. చైనా కొన్నేళ్లుగా అక్కడ సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది.