Massive Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం…అలర్ట్ చేసిన నాసా..!!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోందని గుర్తించింది.
- By Hashtag U Published Date - 06:00 AM, Mon - 23 May 22

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోందని గుర్తించింది. 3,400 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ గ్రహశకలం భూమి వైపు వేగంగా కదులుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీని వేగం గంటకు 47,196 కిలోమీటర్లుగా ఉందని, మే 27న ఇది భూమికి అత్యంత చేరువకు చేరుకునే అవకాశం ఉందని అంచనా చేస్తున్నారు. అంతకుముందు మే 15 న, పరిశోధకులు 1,600 అడుగుల వెడల్పు గల గ్రహశకలం గురించి సమాచారాన్ని అందించారు. ఆ గ్రహశకలం భూమికి దగ్గరగా రానప్పటికీ. నాసా ముందుగానే హెచ్చరించింది. అయితే ఈ సారి మాత్రం మునుపటి గ్రహశకలం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించింది.
అయితే ఈ భారీ గ్రహశకలం పేరు 1989 JAగా నిర్ణయించినట్లు జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. దీని పరిమాణం 3,400 అడుగులు అంటే 1.8 కిలోమీటర్ల వెడల్పు. ఇది అపోలో వర్గానికి చెందిన ఉల్కగా వర్గీకరించారు. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి, ఈ గ్రహశకలం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా కంటే రెండింతలు పెద్దది.
అయితే, పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని. ఈ గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కూడా భూమికి, ఆ గ్రహ శకలానికి మధ్య దూరం 40 లక్షల 24 వేల 182 కిలోమీటర్లు ఉంటుందని నివేదిక తేల్చింది. అయితే ఈ గ్రహశకలం మే 27న భూమికి అత్యంత సమీపానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దీంతో ఎలాంటి ప్రభావం కనిపించదని అభిప్రాయపడ్డారు.
సాధారణంగా అపోలో వర్గానికి వచ్చే గ్రహశకలాలు భూమికి దగ్గరగా వెళతాయి. అలాగే వాటి పరిమాణం కూడా పెద్దదే. అయితే అవి భూమిని ఢీకొన్న సందర్భంలో, చాలా నష్టం జరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ గ్రహశకలాన్ని సాధారణ బైనాక్యులర్స్ ద్వారా చూడవచ్చు. మళ్లీ అలాంటి ఘటనే 2029లో కనిపిస్తుంది.