President Elections : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకతలు.. పోలింగ్ బాక్స్ కి కూడా విమానంలో టిక్కెట్!
భారత రాష్ట్రపతి ఎన్నికకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశంలో జరిగే సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది.
- By Hashtag U Published Date - 02:00 PM, Fri - 10 June 22

భారత రాష్ట్రపతి ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశంలో జరిగే సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. మన దేశంలో అర్హులైన వారు ఎన్నిసార్లయినా రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. కానీ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండోసారి ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పటివరకు 15 సార్లు జరిగాయి. 1977లో ఒక్క నీలం సంజీవరెడ్డి మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా విప్ జారీచేయదు. దీంతో అభ్యర్థులలో ఎవరికైనా సరే.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు.
రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడాలంటే నామినేషన్ సమయంలో రూ.15,000 డిపాజిట్ ను చెల్లించాలి. 1967లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కు చోటు లేదు. ఓటింగ్ ముగిశాక పోలింగ్ బాక్సులను పార్లమెంట్ లో ఉన్న ఎన్నికల కార్యాలయానికి చేర్చాలి. దీనికోసం బ్యాలెట్ బాక్స్ కి కూడా ప్రయాణికుడితో పాటు విమానంలో టిక్కెట్ ను కొంటారు. బ్యాలెట్ బాక్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పేరుతో ఈ టిక్కెట్ ను కొంటారు. ప్రయాణికుడిలా దీనిని సీటులోనే ఉంచి గమ్యస్థానానికి చేరుస్తారు. ఆ విమానంలో వెళ్లే పాసింజర్స్ లిస్టులో బ్యాలెట్ బాక్స్ పేరు కూడా ఉంటుంది. చాలాకాలం నుంచి ఈ సాంప్రదాయం ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ ఇచ్చే పెన్నులను మాత్రమే బ్యాలెట్ పై వాడాలి. వేరే కలం ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదు. ఈ ఎన్నికల్లో నోటాకు ఛాన్సే లేదు. ఏదో ఒక అభ్యర్థికి ఓటు వేయక తప్పదు. 1997లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిని 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాల్సి ఉంటుంది. వారంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యుండాలి.