Yadadri Parking Fees : యాదాద్రిపై పార్కింగ్ రుసుం తొలి గంటకు రూ.500, ఆపై గంట గంటకూ రూ.100
యాదాద్రి లక్షీనరసింహస్వామిని కనులారా దర్శించుకోవాలన్నది భక్తుల కోరిక. దాని కోసం కొండపై కొలువున్న స్వామి చెంతకు వెళ్లాలంటే బాదుడే బాదుడు స్కీమ్ ను మొదలుపెట్టింది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.
- By Hashtag U Published Date - 10:23 AM, Sun - 1 May 22

యాదాద్రి లక్షీనరసింహస్వామిని కనులారా దర్శించుకోవాలన్నది భక్తుల కోరిక. దాని కోసం కొండపై కొలువున్న స్వామి చెంతకు వెళ్లాలంటే బాదుడే బాదుడు స్కీమ్ ను మొదలుపెట్టింది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. అది కూడా అలా ఇలా కాదు. బండిని కొండపైకి తీసుకెళ్లాలంటే బ్యాంకు బ్యాలెన్స్ లు చెక్ చేసుకోవాలనేటంతగా పెంచేసింది. దీంతో భక్తులు మండిపడుతున్నారు. మరీ ఇంత డబ్బు ఆశ ఎందుకు అని ఆవేదన చెందుతున్నారు.
ఎవరైనా సరే.. వాహనాల ద్వారా కొండపైకి చేరుకోవాలంటే కచ్చితంగా పార్కింగ్ రుసుం చెల్లించాల్సిందే. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ పార్కింగ్ రుసుం తొలి గంటకు రూ.500 అని దేవస్థానం అంటోంది. అక్కడితో ఆగలేదు. మరో బాదుడు కూడా ఉంది. ఒక వేళ నిర్ణీత గంట కాలంలోపు బండిని తీయకపోతే ఆపై ప్రతీ గంటకూ రూ.100 చెల్లించాలని దేవస్థానం అంటోంది.
స్వామివారి ఆలయ ఉద్ఘాటన జరిగిన తరువాత వీవీఐపీ ప్రోటోకాల్ వాహనాలు తప్ప వేరే వాహనాలు కొండపైకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. అయినా సరే.. ఎలాగోలా రోజూ 60-70 వాహనాలు కొండపైకి వస్తున్నాయని దేవస్థానం అధికారులు గమనించారు. అందుకే ఈ మేరకు ఏప్రిల్ 26న దీనిపై చర్చించారు. కొండ కింద ఉన్న కనుమదారి దగ్గర ప్రవేశ రుసుం టిక్కెట్లు పెడితే ఎలాంటి సమస్యా ఉండదని భావించారు. దానిని అమలు చేశారు.
కొండపైకి చేరుకునే వాహనాల కోసం రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించారు. క్యూకాంప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాండ్ దగ్గర, వీఐపీ అతిథి గృహం దగ్గర ఖాళీ స్థలంలో వాహనాలను నిలపడానికి అనుమతి ఇచ్చారు. మే 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాకపోతే కొంతమందికి మాత్రం మినహాయింపులు కల్పించారు. దేవస్థానానికి ఎవరైతే భారీగా విరాళాలు ఇచ్చారో అలాంటి తమ గుర్తింపు కార్డులు చూపించి కొండపైకి ఎలాంటి ప్రవేశ రుసుం లేకుండా తమ వాహనాల ద్వారా వెళ్లవచ్చు. ఆలయాన్ని పునర్నిర్మించడానికి ముందు.. అంటే ఆరున్నరేళ్ల కిందట పార్కింగ్ రుసుం చాలా తక్కువగా ఉండేది. నాలుగు చక్రాల వాహనాలకైతే.. రూ.20, ద్విచక్ర వాహనాలకైతే రూ.10 ఉండేది. కానీ ఇప్పుడు ఎవరూ కలలో కూడా ఊహించనంతగా పెంచేశారు.