TS CJ Swearing: ఈనెల 28న రాజ్ భవన్ కు సీఎం వెళ్తారా?
తెలంగాణలో అసలైన రాజకీయ సన్నివేశం ఈనెల 28న ఆవిష్కారం కానుంది. ఆరోజున ఉదయం 10.30 గంటలకు హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం ఉంది.
- Author : Hashtag U
Date : 27-06-2022 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో అసలైన రాజకీయ సన్నివేశం ఈనెల 28న ఆవిష్కారం కానుంది. ఆరోజున ఉదయం 10.30 గంటలకు హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాల్సింది రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఆ కార్యక్రమం కూడా రాజ్ భవన్ లోనే జరుగుతుంది. అదే ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు, డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరవ్వాలి. మరి కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళతారా?
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ రాజభవన్ కు వెళతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కానీ అదే రోజున అదే సమయంలో కేసీఆర్ కు టీ-హబ్ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. దానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అంటే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన వెళ్లడం కష్టమే. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.
మామూలుగా అయితే ఇలాంటి భవన ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే ప్రచారం నడిచింది. కానీ ఆదివారం నాడు మాత్రం కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ట్వీట్ చేశారు. అంటే వ్యూహాత్మకంగానే ఇదంతా జరిగిందా? ఈమధ్యకాలంలో ప్రధాని మోదీ రెండుసార్లు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉన్నారు.
ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయాలన్న ప్రతిపాదనల నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసై కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ నియామకం విషయంలోనూ గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదనలు పక్కన పెట్టారు. పూర్తిస్థాయి ఛైర్మన్ ను ఎన్నుకోవాలని చెప్పారు. దీంతోపాటు రాజ్ భవన్ లో జరిగిన ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ వేడుకలకు సీఎం, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా హాజరు కాలేదు. గవర్నర్ జిల్లాల పర్యటన విషయంలోనూ ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో ఆ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సుమారు పది నెలల నుంచి కేసీఆర్ రాజ్ భవన్ ముఖం చూడలేదు. అదే సమయంలో గవర్నర్ పై టీఆర్ఎస్ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలు పెరిగాయి. ఇలాంటి సమయంలో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళతారా లేదా అన్న చర్చనీయాంశమైంది.