TS Congress: కాంగ్రెస్ లీడర్ల వల్లే ‘ఆ పెద్దమనిషి’ గాంధీ భవన్ రావడం లేదా?
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చిన మొదట్లో వరుస మీటింగులు, జిల్లాల పర్యటనలతో హాడావిడి చేసిన ఠాగూర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే మానేసాడు.
- Author : Siddartha Kallepelly
Date : 23-01-2022 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చిన మొదట్లో వరుస మీటింగులు, జిల్లాల పర్యటనలతో హాడావిడి చేసిన ఠాగూర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే మానేసాడు. దుబ్బాక ఎన్నికల్లో చాలా సీరియస్ గా పనిచేసిన ఠాగూర్ ఆ తర్వాత వచ్చిన ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకట్రెండు సమీక్షలు తప్పా కనీసం పార్టీ బలోపేతంపై కూడా సమావేశాలు నిర్వహించడం లేదు.
గత కోద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్లే ఠాగూర్ పార్టీ సమావేశాలకు హాజరుకావట్లేదని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా ఎదుటే తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇలాంటి వివాదాల మధ్య తాను ఎంటరయితే సమస్య మరింత జఠిలమవుతుందని ఠాగూర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన ఈ మధ్య గాంధీ భవన్ కి కూడా రావడం లేదు.
పార్టీలో రేవంత్ తీరుపై చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్ది రోజుల క్రితం జూమ్ ద్వారా జరిగిన పార్టీ పోలిటికల్ అఫైర్స్ సమావేశంలో కూడా కోందరు నేతలు రేవంత్ పై తమ అసంతృప్తిని వెలిబుచ్చారట. ఠాగూర్ గాంధీ భవన్ వస్తే రేవంత్ పై ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా కొందరు నేతలు ఉన్నారట. ఒకవేళ ఠాగూర్ హైదరాబాద్ వస్తే నేతలంతా పరస్పరం ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, ఇది పార్టీకి, తనకు మరింత తలనోప్పిగా మారే అవకాశం ఉందని భావించిన ఠాగూర్ ఇటువైపే రావట్లేదు.
పార్టీ వరుస ఓటములు, నేతల మధ్య విభేధాలు, తాను సర్ధిచెప్పినా కొందరు నేతలు పట్టించుకోకపోవడంతో ఠాగూర్ సతమతమవుతున్నారట. అయితే పార్టీకి ఇంచార్జ్ గా ఉన్న వ్యక్తి నెలలో కనీసం రెండు రోజులైన పార్టీ కార్యాలయానికి రాకపోతే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారట.
సమస్యలని పరిష్కరించాల్సిన వ్యక్తే సమస్యలకు బయపడి పారిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని కాంగ్రెస్ నేతలు ఆందోళన పడుతున్నారు.