Sonia Gandhi Birthday : సోనియమ్మ బర్త్ డే వేళ.. తెలంగాణకు రెండు గిఫ్ట్స్
Sonia Gandhi Birthday : ఇవాళ డిసెంబర్ 9.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు.
- By Pasha Published Date - 01:33 PM, Sat - 9 December 23

Sonia Gandhi Birthday : ఇవాళ డిసెంబర్ 9.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రెండు కానుకలు అందనున్నాయి. వీటిలో మొదటిది.. మహిళా లోకానికి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం. రెండోది.. తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స సదుపాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. ఈ ప్రయోజనాలు అందుబాటులోకి రానుండటంతో యావత్ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ సంక్షేమ పథకాలపై రాష్ట్రంలోని ప్రతి ఇంటా చర్చ జరుగుతోంది. సోనియమ్మ బర్త్ డే వేళ అందుతున్న ఈ కానుకలు తమ జీవితాలను మారుస్తాయని ప్రజలు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మహిళలకు ఫ్రీ జర్నీ
సోనియమ్మ బర్త్ డే కానుకగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వనితలు ఉచితంగా ప్రయాణించొచ్చు. అయితే జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కండక్టర్‌కు మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రం సరిహద్దు దాటితే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ జర్నీ అవకాశం ఉంటుంది. ఈ పథకంతో ఒక్కో ఆర్టీసీ రీజియన్ నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కారుపై దాదాపు రూ. 50 లక్షల చొప్పున భారం పడనుంది. ఇదంతా కలుపుకుంటే రోజూ కొన్ని కోట్లు అవుతుంది. అయినా ఇచ్చిన మాట ప్రకారం.. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ సర్కారు కల్పించింది.
Also Read: Netflix CEO Ted Sarandos: మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబు
రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యం
ఈరోజు నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద వైద్యానికి రూ.10 లక్షల సాయం అందుతుంది. గతంలో దీని పరిమితి ఐదు లక్షల వరకే ఉండగా… ఇప్పుడిది సోనియమ్మ కానుకగా 10 లక్షలకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుంది. ఈ పథకం కింద ఉన్న వారు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. 1,310 ఆసుపత్రిల్లో ఈ వైద్య సేవలు అందుతున్నాయి. వీటిల్లో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీల ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని రోగాలకు సేవలు అందుతున్నాయి. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఐదు లక్షల పరిమితితో ఈ స్కీమ్ కొనసాగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… రూ. 10 లక్షల వరకు పరిమితిని పెంచింది.
78 కిలోల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్
సోనియా గాంధీ ఇవాళ 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో సోనియమ్మ పుట్టిన రోజు వేడుకలను(Sonia Gandhi Birthday) ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా 78 కిలోల కేక్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో సీఎం రేవంత్ కట్ చేయించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో రెండింటిని సోనియమ్మ పుట్టిన రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కష్టం వల్లే అధికారంలోకి వచ్చామని.. వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు.