Bhadradri Kothagudem: చలాన్ల పైనే ఫోకస్ చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ సమస్యను నియంత్రించాల్సిన టాఫిక్ పోలీసులే ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాల్సిన అవసరం కూడా అంతే ఉంటుంది.
- Author : Praveen Aluthuru
Date : 23-05-2023 - 3:32 IST
Published By : Hashtagu Telugu Desk
Bhadradri Kothagudem: ట్రాఫిక్ సమస్యను నియంత్రించాల్సిన టాఫిక్ పోలీసులే ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాల్సిన అవసరం కూడా అంతే ఉంటుంది. రహదారులపై వాహనదారులను ఇబ్బంది పెడుతూ ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపేస్తు ట్రాఫిక్ సమస్యలను సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఫోటోలు తియ్యడమే పనిగా పెట్టుకుని రహదారులపై ట్రాఫిక్ ని పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఫోటోలు తియ్యడం, చలాన్లు రాయడం, అవసరమైతే వాహనాన్ని సీజ్ చేయడం ఇదే తంతూ కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని కోరుతున్నారు ప్రజలు. వాహనదారులు తమ వాహనాలు బయటకు తీయాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాఫిక్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. నడీ రోడ్డుపై పోలీసుల పహారా కాస్తూ కృత్రిమ ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారు. దీంతో పట్టణ ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తెలంగాణాలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి తమ పట్టణంలోనే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాన్ని బయటకు తీయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు ఖాకీలు తమ విధులను పక్కనపెట్టి కేవలం చలాన్లను రాబట్టేందుకే పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

బార్లు, వైన్స్ షాపుల ముందు మఫ్టీలో ఉంటూ పట్టుబడిన వారికి వేలకు వేలు చలాన్లు వేస్తున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కిక్కిరిసిపోయినా పట్టించుకోవడం లేదు. ఎస్సై స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి ఇలా అందరూ వాహనదారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదేందీ అని ప్రశ్నిస్తే తమదైన రీతిలో సమాధానం ఇస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ కొత్తగూడెం పట్టణంలో 6 గంటలు దాటితే ట్రాఫిక్ పోలీసులు, ఖాకీలు గల్లీలో కనిపిస్తున్నారు. ఇదేందయ్యా అంటే పెండింగ్ చలాన్లు, హెల్మెట్ లేని వాహనదారులను పట్టుకోవడంపైనే దృష్టి సారిస్తున్న పరిస్థితి. దీంతో ప్రధాన రహరులపై ట్రాఫిక్ చిక్కులు ఎక్కువవుతుండటం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా రైతు బజార్, సింగరేణి సూపర్ బజార్, బస్టాండు మరియు మేదర బస్తీ వెళ్లే దారుల్లో పోలీసులు ఎక్కువగా తిష్ట వేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే శాంత్రిభద్రతల విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలకు పాల్పడినా తప్పులేదు కానీ వాళ్ళ విధులను మరిచి కేవలం చలాన్ల కోసమే పని చేయడం బాధాకరం.
Read More: Viveka murder : అవినాష్ అరెస్ట్ కు`సుప్రీం` గ్రీన్ సిగ్నల్