Record : అరుదైన రికార్డ్ సాధించిన TGSRTC
Record : ఈ పథకం కింద ఇప్పటివరకు 200 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రయాణాల విలువ అక్షరాలా రూ. 6,700 కోట్లు కావడం గమనార్హం.
- By Sudheer Published Date - 04:03 PM, Tue - 22 July 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం (Mahalaxmi Scheme) ద్వారా టీఎస్ ఆర్టీసీ (TGSRTC ) అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 200 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రయాణాల విలువ అక్షరాలా రూ. 6,700 కోట్లు కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు సిటీ ఆర్డీనరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ విధానం వల్ల మహిళలకు శ్రమలేని, ఖర్చులేని రవాణా సౌలభ్యం లభించింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమానికి తొలి అడుగుగా ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, కేవలం ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకునే విధంగా సౌకర్యం కల్పించారు. గత 18 నెలలుగా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆర్టీసీకి మద్దతు ఇస్తోంది.
Roundworms : పిల్లలకు వర్షాకాలం నులిపురుగుల మందు వేయించడం మరిచారా?
ఈ అద్భుతమైన 200 కోట్ల ప్రయాణాల మైలురాయి సందర్భంగా జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, మరిన్ని బస్సుల అవసరం ఏర్పడినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉండటంతో, కొత్త బస్సులు జోడించే దిశగా అధికారులు చర్చలు ప్రారంభించారు.
ప్రస్తుతం పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, నగరంలో కూడా ఈ బస్సులు సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు టీఎస్ ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేయడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసి, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ప్రోత్సహిస్తోంది.