Roshaiah : రోశయ్య మృతిపై ప్రముఖుల సంతాపం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం
- By Balu J Published Date - 11:13 AM, Sat - 4 December 21

ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. ఆయన మరణం పట్ల పలువరు ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : కేసీఆర్
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎంతగానో బాధించింది : సీఎం జగన్
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా… సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
రాజకీయాలకు తీరని లోటు : చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు. సౌమ్యుడిగా, నిరాడంబరునిగా పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ చిత్తశుద్ధితో, ప్రజలకు సేవలందించిన రోశయ్యగారి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు. రోశయ్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీరని లోటు : బండి సంజయ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం. సుదీర్ఘ కాలం ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసి, అత్యధిక బడ్జెట్లను రూపొందించిన మంత్రిగా ఘనత సాధించారు. వారి మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీరని లోటు. రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
ఆ పదవులకే వన్నె తెచ్చాడు : రాఘవేందర్ రావు
ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య గారు.. నా సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..