Revanth Vs Jagga Reddy : ఢిల్లీలో నెగ్గేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముదిరింది. తాడోపేడో తేల్చుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధం అయ్యారు. హుటాహుటిన కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టీ విక్రమార్క్, ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఢిల్లీ వెళ్లారు.
- By CS Rao Published Date - 02:32 PM, Tue - 22 March 22

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముదిరింది. తాడోపేడో తేల్చుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధం అయ్యారు. హుటాహుటిన కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టీ విక్రమార్క్, ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఢిల్లీ వెళ్లారు. తాజా పరిణామాలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లాడు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ తో భేటీ కావాలని నిర్ణయించుకున్నాడు. పీసీసీ అధ్యక్షుని హోదాలో జగ్గారెడ్డిపై తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పీసీసీ చీఫ్ వాలకాన్ని ఎకరువు పెట్టడానికి సీనియర్లు ఢిల్లీలో మకాం వేశారు.ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత పీసీసీలను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ మేరకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరడం హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీనియర్ల గుర్రుగా ఉన్నారు. పార్టీని కాపాడుకుంటామంటూ ఢిల్లీకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి పాకులాడుతున్నాడని సీనియర్ల ఆరోపణ. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని భావిస్తున్నారు. అదే, విషయాన్ని ఏఐసీసీకి కూడా చెబుతున్నారు. ఏడాది కాలంగా పలుమార్లు సీనియర్లు, రేవంత్ మధ్య సఖ్యత కుదర్చడానికి ఇంచార్జి మాణిక్ ఠాకూర్ ప్రయత్నం చేశాడు. తాత్కాలికంగా పరిష్కారం లభించినప్పటికీ అంతర్గత పోరు మాత్రం తగ్గలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతోంది.
హుజూరాబాద్ ఉప ఫలితాల తరువాత రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఆయన నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మునుపటి విశ్వాసం పెట్టుకోవడంలేదు. సమాంతరంగా వ్యవస్థను నిర్మాణం చేస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని కమిటీలను వేసింది. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడానికి లేదని చెక్ పెట్టింది. ఇతర పార్టీల నుంచి వచ్చే లీడర్లను ఇష్టానుసారంగా తీసుకోవడానికి లేకుండా అడ్డుకట్ట వేసింది. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ సొంత మనుషులను అభ్యర్థిత్వాల కోసం ఫోకస్ చేస్తున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానంలోనూ రేవంత్ మరొకరిని ఫోకస్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న జగ్గారెడ్డి తిరుగుబాటు బాగుటాను ఎగురవేశాడు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు కట్టుబడి ఉంటానంటూనే రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. త్వరలోనే రేవంత్ కు జలక్ ఇస్తానని హెచ్చరించాడు. కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీలను ప్రక్షాళన చేయడం ఇబ్బంది కరమే. పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా తెలంగాణలో జరగలేదు. డిజిటల్ పద్ధతిన జరగాల్సిన మెంబర్ షిప్ చాలా వెనుకబడి ఉంది. ఇదంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని లోపాల కారణంగా జరుగుతోందని సీనియర్లు ఫోకస్ చేస్తున్నారు. నేరుగా సోనియా గాంధీని కలిసే వాళ్లలో వీహెచ్ ప్రముఖంగా ఉన్నాడు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అధిష్టానం జై కొట్టే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. జగ్గారెడ్డి సస్పెండ్ కు ఏఐసీసీ ఓకే అంటే ఇక రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదు.