Telangana CM Meets Sonia : తెలంగాణ నుంచి పోటీ చేయండి – సోనియా కు రేవంత్ రిక్వెస్ట్
- Author : Sudheer
Date : 05-02-2024 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
* రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం..
* మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నాం
* పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం…
* సీపీపీ ఛైర్మన్ సోనియా గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి
న్యూ ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10, జన్‌పథ్‌లో ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, ప్రసార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందజేత, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియాగాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.
Read Also : MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా