Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు టీకాంగ్రెస్ గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ లేని రుణాలు
- By Balu J Published Date - 11:17 PM, Sun - 18 February 24

Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పట్నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఆశా వర్కర్లకు జీతాలు అందే విధంగా కృషి చేస్తానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై లింగ వివక్షను నిర్మూలించి, వారిని అభివృద్ధి చేయడానికి డ్వాక్రా(డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని 1982లో అమల్లోకి తెచ్చారు. మొదటగా దీన్ని దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా అనేక జిల్లాల్లో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. డ్వాక్రా పథకం ముఖ్యోద్దేశం మహిళల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం.