Supreme Court: గద్వాల్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్, అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో ఊరట!
అనర్హత వేటు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది.
- By Balu J Published Date - 03:10 PM, Mon - 11 September 23

Supreme Court: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. బండ్ల ఎన్నికలు చెల్లవని ప్రకటించిన తెలంగాణ హైకోర్టు తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పుతో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ ఎమ్మెల్యే అయ్యారు. వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు రెండు వారాల్లోగా స్పందించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఆదేశించింది.
తనకు సరైన నోటీసులు ఇవ్వకుండా ప్రత్యర్థులు హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన ఆవేదనను వివరించారు. 2018 ఎన్నికల్లో 28 వేల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు తాను చట్టబద్ధంగా భూములు విక్రయించానని, నిరాధారమైన ఆరోపణలతో ఈ లావాదేవీలను తప్పుదారి పట్టించారని బండ్ల వివరించారు.
తన వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది తమ పార్టీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈసీ గెజిట్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో న్యాయ పోరాటం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం తో బండ్లకు ఊరట లభించినట్టయింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో డీకే అరుణకు షాక్ తగిలినట్టయింది.