Revanth Reddy’s Appeal : కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Revanth Reddy's Appeal : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 07:12 PM, Mon - 17 March 25

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపు, కుల గణన, సామాజిక న్యాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 4న కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందని, మూడు కోట్ల 58 లక్షల మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని ఆయన వివరించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం కోరిన తెలంగాణ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టామని, చట్ట పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల సహాయంతో అపాయింట్మెంట్ కోరాలని సూచించారు. అలాగే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ పెంపు అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు జనాభా గణన లేకుండా రిజర్వేషన్లు అందజేయలేమని చెప్పిన నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించిందని రేవంత్ తెలిపారు. సర్వే ప్రకారం బలహీన వర్గాల జనాభా 56.3%గా తేలిందని, ఈ హక్కులను బలపర్చేందుకు తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బీసీలు పాలితులు కాకుండా పాలకులుగా మారాలని, అందుకు అవసరమైన మార్గాన్ని రూపొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని, అందుకు ప్రతిపక్ష నేతల సహకారం కూడా అవసరమని అన్నారు.
Anchor : డిప్రెషన్లోకి స్టార్ యాంకర్..కారణం వారేనట!