CM Revanth : టీచర్లను తేనెటీగలుతో పోల్చిన సీఎం
తేనెటీగలు ఎవరి జోలికి పోవు. వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. టీచర్లు కూడా తమను ఎవరైనా రాయితో కొడితే మూకుమ్మడిగా ఎవరిపనైనా చెబుతారు
- By Sudheer Published Date - 08:29 PM, Fri - 2 August 24

టీచర్ల (Teachers ) విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఎవరైనా భయపడతారని, వాళ్లు తేనెటీగల్లాంటి (Bees) వారని CM రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ‘తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను మీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది..రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం అంటూ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మొన్న అసెంబ్లీలో ఒకాయన మాట్లాడుతూ తాను గుంటూరులో, పూనాలో, అమెరికాలో చదువుకున్నానని చెబుతున్నాడని, తనకు గొప్పగొప్ప చదువులు వచ్చునని చెప్పే ప్రయత్నం చేశారని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నువ్వు ఎక్కడ చదివావు అంటూ ఆ వ్యక్తి నన్ను వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేశాడన్నారు. కానీ నేను కొండారెడ్డిపల్లెలో, తాండ్ర, వనపర్తి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్నానని చెప్పానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో… ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువుతోనే తాను జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిని అయ్యానని ఆయనకు చెప్పానన్నారు. ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువుతో తాను సీఎంను అయ్యానని… ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడ్డానన్నారు. ఏ ప్రభుత్వ టీచర్లు చదువు చెబితే ఈ స్థాయికి ఎదిగామో… ఆ టీచర్లను కలిసేందుకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థులు ఉన్నారని… తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని వివరించారు.
టీచర్ల విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఎవరైనా భయపడతారని, వాళ్లు తేనెటీగల్లాంటి వారని సీఎం రేవంత్ అన్నారు. ‘తేనెటీగలు ఎవరి జోలికి పోవు. వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. టీచర్లు కూడా తమను ఎవరైనా రాయితో కొడితే మూకుమ్మడిగా ఎవరిపనైనా చెబుతారు’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. టీచర్ల బదిలీల విషయంలోనూ తనను కొందరు హెచ్చరించారని, అయితే వాళ్ల సమస్యను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి. గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకు పైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం.. అని సీఎం పేర్కొన్నారు.
Read Also : Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్