MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ
- By Sudheer Published Date - 11:52 AM, Mon - 5 February 24

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ (ED) నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 16న విచారణకు రావాలని ఈడీ నోటీసులివ్వగా, ఆమె హాజరుకాలేదు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam) దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ విచారణలో భాగంగా గతంలో తాను ఉపయోగించిన సెల్‌ఫోన్లను అధికారులకు అప్పగించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మె్ల్సీ కవిత. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబరులో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. దీంతో నవంబరు వరకు కవితను విచారణకు పిలవరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంతలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇప్పుడు మరోసారి ఈడీ కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో.. విచారణకు హాజరు కాలేనన్న కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Read Also : T.Congres : రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత..?