HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pawan Kalyan Says Bringbacknetajiashes To India

Pawan Kalyan: ‘నేతాజీ’ అస్తికలు దేశానికి తీసుకురావడమే నా లక్ష్యం – ‘పవన్ కళ్యాణ్’

నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే నా కోరిక.. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  • By Hashtag U Published Date - 05:50 AM, Fri - 25 March 22
  • daily-hunt
pawan kalyan
pawan kalyan

నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే నా కోరిక.. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జపాన్ దేశంలోని రెంకోజీ టెంపుల్ లో ఉండిపోయిన ఆయన అస్తికలు రెడ్ ఫోర్ట్ లో పెట్టాలని, దానిపై భారత మువ్వన్నెల జెండా ఎగరాలని డిమాండ్ చేశారు. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలన్నారు. అది మనందరిలో నేతాజీ సుబాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపాలన్నారు. అందుకోసం ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా..

నేతాజీ తాలూకు అస్తికలు తిరిగి దేశానికి తెప్పించేందుకు ప్రభుత్వాధినేతల మీద, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరం ఒక మాట మీద ఉండి ఒత్తిడి తీసుకురాకపోతే ఉదాసీనత నిండిన వ్యక్తుల్లో చలనం రాదు అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచే మనం ఆ పోరాటాన్ని మొదలుపెడదాం. అది ఒక రోజు దేశం మొత్తం విస్తరించాలి.. నేతాజీ అస్తికలు భారతదేశంలోకి రావాలి.. మనం ఆయనకు సెల్యూట్ చేయాలన్నారు. అందుకోసం బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు రూపొందించారు. గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు రాసిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం టోక్యో వెళ్లినప్పుడు నాడు పాస్ పోర్ట్ ఆఫీసర్ గా ఉన్న రాజశేఖర్ ఒక చోటుకు తీసుకువెళ్లారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు ఉన్న రెంకోజీ టెంపుల్ అది. నేతాజీ అస్తికలు భద్రపరిచిన ఆయన కుమార్తె అక్కడ ఉన్నారు. ఆమె నేతాజీ అస్తికలు చూపిస్తే నా హృదయం ద్రవించుకుపోయింది. మన దేశంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారికి పెద్ద పెద్ద స్మారకాలు కడతారు. చనిపోతే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తారు. ఇలాంటి మహానుభావుడు ఇంతటి చైతన్యం కలిగించిన వ్యక్తి ఎందుకు దిక్కు లేకుండా అయిపోయారు అని అనుకున్నా. అక్కడ ఉన్న పుస్తకంలో ఒక మాట రాశాను. నేతాజీ అస్తికలు ఒక రోజు భారతదేశంలోకి తీసుకురావాలి అని రాశాను. ఈ విషయాన్ని ఇంత వరకు ఎవరితో పంచుకోలేదు. ఇది యాదృచ్చికమే కావచ్చు. కానీ అది నేతాజీ పిలుపు.

అస్తికలు ఆయనవో కాదో పరీక్షించాలి అనుకుంటే ఈ రోజు డీఎన్ఏ పరీక్షలు ఎన్నో వచ్చాయి. మరి ఎందుకు తీసుకురారు అన్నది ఓ సగటు భారతీయుడిగా నా ఆవేదన. ఆ అస్తికలు చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది. జపనీస్ సంస్కృతిలో భాగంగా పూర్వీకుల అస్తికలు దేవుడి గుడిలో భద్రపరుస్తారు. అలాంటిది ఎవరివో అక్కడ ఎందుకు పెడతారు. అవి కచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారివి అని నేనే గాఢంగా నమ్మాను అని అన్నారు పవన్ కళ్యాణ్.

ఈ పుస్తకం ఒక దైవ ప్రేరణ:
ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయిపోయాయి. అయినా ఈ రోజుకీ ఎవరూ తీసుకురాలేదు. ఇప్పటికి మూడు కమిషన్లు వేశారు. అయినా ఉపయోగం లేదు. పీవీ నరసింహారావు లాంటి వాళ్లు ఎవరైనా తీసుకువద్దామనుకున్నా.. వాజపేయ్ లాంటి వాళ్లు ప్రయత్నించినా కుదరలేదు. దానికి కావాల్సింది ప్రజలు కోరుకోవడం. మనలాంటి వాళ్లు బలంగా కోరుకోవాలి. ఆ అస్తికలు రావాలి. ఈ పుస్తకం ఒక దైవ ప్రేరణ. ఆయన పోరాటం, చనిపోయిన విధానాన్ని శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు స్పష్టంగా ఇందులో ప్రస్తావించారు. అంతకంటే ముందు శాస్త్రి గారి శైలి గురించి చెప్పాలి. శాస్త్రి గారు సెక్యులరిజం మీద పెక్యులరిజం అంటూ ఓ సెటైరికల్ పుస్తకం రాశారు. అందులో ఆయన రాసిన మాటలు.. ఒక ఇంటికి బృందావనం అనో శాంతినికేతన్ అనో ఫలకం వేసినంత మాత్రాన అది నిజంగా శాంతినికేతనో బృందావనమో అయిపోదు. అలాగే రాజ్యాంగంలో సెక్యులర్ పదం చేర్చినంత మాత్రాన సెక్యులర్ రాజ్యం అయిపోదు. ఆ పదాలు గుండెలోతుల్లో నుంచి రావాలి. శాస్త్రి గారి శైలి జబ్బులకు వేసే చేదు కషాయం లాంటిది. కషాయం ఇచ్చే డాక్టర్ నచ్చకపోయినా జబ్బు నయం కావడానికి అలాంటి డాక్టర్లే అవసరం. మన సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలకు ఒక మేధావిగా, సీనియర్ జర్నలిస్టుగా, సోషల్ డాక్టర్ గా శాస్త్రి గారు రాస్తున్న పుస్తకాలు దివ్యా ఔషదాల్లాంటివి. ఆయన వాదనలో కొన్ని వాక్యాలు చాలా మందికి రుచించకపోయినా.. అందులో సత్యం తాలూకు శక్తి మాత్రం వెంటాడుతుంది.

జపాన్ సైన్యానికే ఆంక్షలు పెట్టారు:
ఇప్పుడు రాసిన నేతాజీ రెండో భాగం. ఈ పుస్తకం సాక్షిగా నేతాజీ అస్తికలు భారత దేశానికి రావాలని కోరుకుందాం. అలాంటి మహాత్ముడిని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదు. నేతాజీ పుస్తకంలో ఆ మహనీయుడు పడిన కష్టాలు కళ్లకు కట్టారు. ఆయన మణులు, మాణిక్యాలు, పేరు కోరుకోలేదు. పదవులు కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఒక్కటే మన దేశం బానిస చెర నుంచి విముక్తి కావాలని. అలాంటి మహనీయుడు దిక్కులేకుండా చనిపోతే ఆయన అస్తికలు రెంకోజీ టెంపుల్లో పడి ఉంటే ఒక్కరికి కూడా మనసు కలగదు. రాజకీయ నాయకులకు మనసు రాదు. పెద్దలకు మనసు కరగదు. దీనికోసం ఈ సరికొత్త తరం పూనుకోవాలి. ఎందుకు పూనుకోవాలో చెబుతా. దేశానికి పోరాట స్ఫూర్తిని నింపిన నిలువెత్తు నాయకుడు ఆయన. సాయం చేస్తామన్న జపనీస్ సైన్యానికే ఆంక్షలు పెట్టిన ధీశాలి.

మీకు స్వతంత్రం మేము ఇప్పిస్తాం.. మీరు తూతూ మంత్రంగా ఉండండి చాలన్న జపనీస్ సైన్యాధికారులకు ఆయన ఒక్కటే చెప్పారు. మిమ్మల్ని తూతూ మంత్రంగా చూసుకుంటాం. మా స్వతంత్ర పోరాటం మేమే చేసుకుంటాం మీరు అండగా ఉండండి చాలు. మా దేశంలో ప్రవేశించాక జపాన్ సైన్యాధికారులు మా నియంత్రణలో పని చేయాలి. స్త్రీలపై అఘాయిత్యాలు, లూటీలకు పాల్పడితే అక్కడిక్కడ కాల్చేయమని మా ఇండియన్ ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్లకి ఆదేశాలు ఇచ్చాం… మీరు మాకు అండగా ఉంటే మంచిది.. అని నిక్కచ్చిగా ఆయన చెప్పిన మాటలకు ఎవ్వరికీ నోటి మాట లేదు.

బెబ్బులి లాంటి ఆడపడుచుల్ని తయారు చేశారు:
నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఉన్న 50 వేల మందిలో, 30 వేల మంది బ్రిటీష్ ఆర్మీ నుంచి విడిపోయి వస్తే.. 20 శాతం మంది ఆయన కలిగించిన ప్రేరణ, రగిల్చిన స్ఫూర్తి నుంచి వచ్చిన వారు. ఆ 20 శాతంలో 70 శాతం దక్షిణ భారతం నుంచి వచ్చినవారే. స్వతంత్ర సమరంలో నాయకులు మినహా ఎక్కువ మంది ప్రాంతాలు, రాష్ట్రాలకే పరిమితం అయ్యారు. ఈ దేశం మొత్తం నాది అనుకునే వ్యక్తులు కనుమరుగయ్యారు. అలాంటి సందర్భంలో తెలుగు, తమిళం భాషాబేధం లేకుండా సమూహాలుగా మారిపోయారు. ఝాన్సీ రాణీ రెజిమెంట్ ఆర్మీ పేరిట బెబ్బులి లాంటి ఆడపడుచుల్ని సైన్యంగా మలచిన వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సైన్యం నుంచి 300 మంది ఆత్మాహుతి బృందంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 50 మందిని మాత్రమే అందుకు ఎంపిక చేస్తే.. ఆత్మాహుతి దళంలో ఎంపిక కాలేదన్న నిరాశతో ఆరుగురు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అలాంటి వారిని మన దేశం ఈ రోజుకీ గుర్తించలేకపోయింది.
దేశం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేస్తే ఆయన్ని అంతా వ్యతిరేకించారు. అన్ని సార్లు శాంతిదూతలా మాట్లాడడం కాదు, కొన్నిసార్లు కత్తులు పట్టాలి. జ్ఞానం ఉన్నవాడికి శాంతియుత పద్దతిలో చెప్పాలి. మూర్ఖుడికి కత్తులతోనే చెప్పాలి. మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ కొన్ని లక్షల మంది బలిదానాల మీద వచ్చాయి. మనం అన్నింటినీ మర్చిపోయాం. నేను చేయగలిగింది చేస్తాను. అదే నేతాజీకి నిజమైన నివాళిగా భావిస్తాను అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

నేతాజీ చివరి క్షణాలు అలా…
నేతాజీ చివరి క్షణాలు, విమాన ప్రమాదానికి సంబంధించిన అంశాలను కళ్లకు కట్టినట్టు చదివి వినిపించారు. ఆయన చివరి మాటలను చదివి వినిపించారు. ఆయన మాటల్లో.. నేనయితే బతకను మీరు వెనక్కి వెళ్లి దేశ సోదరులకు చెప్పండి నా చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్ర కోసం పోరాడా.. వారు పోరాటం కొనసాగించాలి. హిందుస్థాన్ తప్పక స్వతంత్రం పొంది తీరుతుంది. విమాన ప్రమాదం తర్వాత తల నుంచి పాదాల వరకు మంటలతో పరిగెడుతున్న నేతాజీని చూసిన జపనీస్ అధికారికి వారి అగ్నిదేవుడు గుర్తుకు వచ్చాడు. ఒళ్లంతా కాలినా భయానక వేదన అనుభవిస్తున్నా ఆయన నోటి వెంట ఆ వేదన తాలూకు రోధన వినబడలేదు. తాగేందుకు నీరు మాత్రమే కావాలని అడిగారు. చివరికి 1945 ఆగస్ట్ 18వ తేదీన నేతాజీ గారు కన్నుమూశారు. అలాంటి పోరాట యోధులకు గుర్తింపు ఏది? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

నిన్న కాక మొన్న వచ్చిన వారికి కిరీటాలు, స్మారకాలా?
నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తులకు కిరీటాలు, స్మారక భవనాలు నిర్మిస్తాం. దేశం కోసం ఇంత యుద్ధం చేసిన వ్యక్తిని గౌరవించుకోకపోతే అంతకు మించిన అవమానం ఏముంటుంది. మనలో చలనం ఏ స్థాయిలో చచ్చిపోయిందో.. ఉదాసీన భావనతో మనం ఏ స్థాయిలో కొట్టుకుపోతున్నామో అర్ధం అవుతోంది. నా కోరిక ఒకటే ఏ కష్టం కోసం ఇన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారో వారి కోసం నిలబడదాం. అందుకు ఎవరి ఆనందాలూ తగ్గించుకోమని చెప్పడం లేదు. కనీస బాధ్యతగా ఒక్క అడుగు వేద్దాం. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తించలేని వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. 24 గంటల్లో కేవలం 15 నిమిషాలు దేశం కోసం ఆలోచించండి. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అదే అనిపించింది.

రూ.100 నోటుపై నేతాజీ బొమ్మ ఉండాలి:
నేతాజీ అస్తికలు దేశంలోకి రావాలి. కనీసం 100 రూపాయిల నోటు మీద నేతాజీ బొమ్మ పడాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేద్దాం. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ కి రెండేళ్ల ముందు విదేశాల్లో మన మువ్వన్నెల జెండా ఎగిరింది. జనగణమణకు మొదటి వెర్షన్ జైహింద్ నినాదం ఇచ్చింది సుభాష్ చంద్ర బోస్ గారే. అలాంటి మహానుభావుడికి ఏదో ఒకటి చేయాలన్న కోరిక నన్ను ఇక్కడి వరకు తెస్తే మీరంతా ఇంకా ఎంతో చేయొచ్చు. మీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నిండు మనసుతో మిమ్మల్ని అడిగేది ఒకటే.

మన నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నా. ఆయన ఆస్తికలు రావాలని మనసు పెట్టండి. పూజా మందిరంలో, గదుల్లో, మసీదుల్లో, హిందూ మందిరాల్లో ఒకటే కోరిక పెడదాం నేతాజీ అస్తికలు భారత్ కు రావాలని కోరుకుందాం. అదే ఈ సభ ఉద్దేశం. శ్రీ శాస్త్రి గారు తన రచనతో ఉదాసీనత నిండిన భారత జాతి మీద బాణం విసిరారు. దాన్ని పట్టుకుని నేతాజీ అస్తికలు తెప్పించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఏ దేశమైతే అన్నం పెట్టిందో, ఏ దేశం నీడ నిచ్చిందో దానికి శాల్యూట్ చేస్తూ.. జైహింద్” అన్నారు.

తెలుగు సాహితీ లోకానికి పవన్ కళ్యాణ్ చేసింది మహోపకారం: శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి
నేతాజీ గ్రంధ రచయిత శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ “ప్రజలు పత్రికలు, పుస్తకాలు చదవడం మానేశారు. ఎంత గొప్పగా రాసినా దానిని ప్రజలకు ఎవరు అందిస్తారనే నిరాశకు ఈ మధ్య కాలంలో లోనయ్యాను. పుస్తకాలు రాయడం మానేస్తే మంచిదనే అభిప్రాయానికి కూడా వచ్చాను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ప్రతి ఒక్క రచియిత బాధ, ఆవేదన. గ్రంధావిష్కరణ సభ పెడితే 10 మంది వస్తే ఎక్కువ. పుస్తకం రాసి, అచ్చువేయించి ఫ్రీగా ఇస్తామన్నా చదివేవాడు లేడు. ఇటువంటి సమయంలో ఒక పుస్తకాన్ని ఎంచుకొని, దానిని సమీక్ష కోసం విలువైన సమయాన్ని వెచ్చించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. తెలుగు సాహితీలోకానికి ఆయన మహోపకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యిందిని అమృతోత్సవాలు చేసుకున్నాం.

అయితే ఏ మనిషి వల్ల అది సిద్ధించిందో ఆయన్నే మరిచిపోయాం. స్వాతంత్ర్యం సిద్ధించడానికి కారణభూతుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఇప్పటి వరకు మనం నిజమైన నివాళ్లు ఇవ్వలేకపోయామన్న బాధే ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లే… ఆయన చేసిన సాయుధ పోరాటం వల్లే… అది దేశంలో సృష్టించిన ప్రభంజనం వల్లే స్వతంత్రం ఇచ్చామని బ్రిటిష్ ప్రభుత్వమే చెప్పింది. అమెరికాకు జార్జి వాషింగ్టన్ ఎంతగొప్ప వాడో… అంతకంటే వెయ్యి రెట్లు గొప్ప వాడు సుభాష్ చంద్రబోష్. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయి దాదాపు 77 ఏళ్లు అవుతోంది. ఆయన మృతదేహాన్ని తైవాన్ లో దహనం చేశారు. జపాన్ లోని ఒక గుడిలో ఆయన చితాభస్మం ఉంచారు. ఆ చితాభస్మం దిక్కు మొక్కు లేకుండా ఒక మూలన పడి ఉంటే దానిని ఇప్పటి వరకు మనదేశంలోకి తీసుకురాలేకపోయాం. దేశంలోని పనికిమాలిన మేధావులు అంతా కలిసి ఆ చితాభస్మం తీసుకురావడం మహాపచారమని, కుట్ర అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గాయి. మనకు స్వతంత్రం ఇచ్చిన మహానుభావుడి అస్తికలకు ఇప్పటి వరకు అంతిమ సంస్కారాలు చేయలేకపోయాం.

40 వేల మంది మట్టి మనుషులను నేతాజీ మిషన్ గన్ లు గా మార్చారు. మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లకు స్వతంత్ర సైనికుడిగా గుర్తించి నెత్తిన పెట్టుకోవాలి. నేతాజీ తెచ్చిన స్వాతంత్ర్యాన్ని తేరగా అనుభవించిన రాజకీయ నాయకులు ఆ 40 వేల మందిని స్వతంత్ర్యం రాగానే డిస్మిస్ చేశారు. జేబులు కొట్టి జైలుకు వెళ్లినవారికి స్వాతంత్ర్య సమరయోధులుగా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ విషయాన్ని జనం ముందు పెట్టాలనే ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అంటే ఆయన నిజమైన నాయకుడు అయ్యిండాలి. జనాన్ని కదిలించాలి, నడిపించాలి. అలాంటివాడిని చూడగలనా అనుకున్నాను శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూశాను. సగటు రాజకీయ నాయకుడు అంటే ప్రజల్ని భ్రమల్లో ఉంచాలి, ముంచాలి. అటువంటి నాయకులు దేశభక్తి అనే పదం వింటే చాలు ఉలిక్కి పడతారు. నిజమైన నాయకుడు ఉలిక్కిపడడు. అటువంటి నాయకుడే దేశానికి కావాలి. అటువంటి వాడిని చూసినందుకు గర్వపడుతున్నాను. నీతివంతమైన, దేశంపై భక్తి ఉన్న నాయకుడు రావాలి. అటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నేతాజీ అంశ వారిలో ప్రవేశించి ఆయన ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా” కోరుకుంటున్నాను అని అన్నారు శాస్త్రి గారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bring back ashes
  • netaji
  • Pawan Kalyan
  • subhash chandra bose

Related News

Lokesh Pawan

Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

Pawan Kalyan Next Film : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెటప్‌ కానుందనే వార్త సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd