N Convention : నాగార్జున నిజమైన హీరో – సీఎం రేవంత్
N Convention : హీరో నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్(N Convention) కూల్చివేత ఉదాహరణగా చూపారు.
- By Sudheer Published Date - 07:48 PM, Sat - 28 June 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం, నాళాలపై ఆక్రమణల వల్ల నగరాల్లో జీవించడం రోజు రోజుకు కష్టమవుతోందని తెలిపారు. హైదరాబాద్‌ను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతూ.. హీరో నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్(N Convention) కూల్చివేత ఉదాహరణగా చూపారు. ఆ స్థలం పక్కనే ఉన్న చెరువుతో కలిపి అభివృద్ధి చేయడంలో నాగార్జున స్వయంగా రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి దానం చేయడం, ఆయన్ను నిజమైన హీరోగా నిలబెట్టిందని సీఎం ప్రశంసించారు.
అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించిన సీఎం రేవంత్, కొన్ని రాజకీయ శక్తులు కోర్టు పిటిషన్ల ద్వారా ప్రభుత్వ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కంచ భూముల అభివృద్ధి, రూ.2.25 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి శ్రమిస్తుంటే, కొందరు కోర్టుల్లో అడ్డుపడుతున్నారని చెప్పారు. అయినా కోర్టుల్లోనూ న్యాయపరంగా పోరాడి, కంపెనీలను తీసుకువచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాల నుంచి ఎవరైనా అడ్డుపడ్డా ముందుకు సాగుతామని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, పూర్వ కాంగ్రెస్ నేత పీ.జే.ఆర్. హైటెక్ సిటీకి బీజం వేసిన గొప్ప నాయకుడని, అనంతరం చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే మార్గంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎన్నికలవరకే రాజకీయాలు, ఆ తర్వాత పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ యత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు.