Telangana : బీఆర్ఎస్ కు మరో షాక్.. మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించారు.
- By Sudheer Published Date - 10:34 PM, Fri - 22 September 23

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కొంతమంది టికెట్ రాని తరుణంలో పార్టీకి రాజీనామా చేస్తుండగా..మరికొంతమంది పార్టీపై అసమ్మతితో బయటకు వస్తున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో అగ్ర నేతలు పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా..తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించారు.
గత కొద్ది రోజులుగా మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం పలుమార్లు సీఎం కేసీఆర్(CM KCR)ని అడిగినా ఇవ్వకపోవడంతో మైనంపల్లి ఆగ్రహంతో ఉన్నారు. రీసెంట్ గా మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao)పై కూడా తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. కేవలం తన కొడుక్కు టికెట్ ఇవ్వలేదనే కోపంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 26 న ఢిల్లీ లో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు వినికిడి.
ఇక మైనంపల్లి హన్మంతరావు రాజకీయ రంగం విషయానికి వస్తే.. 1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2008 జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2009 జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.
Read Also : Megastar : ఆ చిరంజీవిని చూపిస్తానంటున్న డైరెక్టర్.. మెగా ప్లానింగ్ అదుర్స్..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మంతరావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించాడు. 2014లో ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో భాగంగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2014 ఏప్రిల్ 6న మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశాడు. 2014న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో హన్మంతరావు 8 ఏప్రిల్, 2014న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. మల్లారెడ్డి పై 28371 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన 21 ఏప్రిల్ 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. మైనంపల్లి హన్మంతరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్. రామచందర్ రావు పై 73698 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా గెలవడంతో 12 డిసెంబర్ 2018న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.