Konda Surekha : తనపై చేస్తున్న ట్రోల్స్ కు కన్నీరు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha Crying : డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడే కాదని.. మొదటి నుంచి కూడా కేసీఆర్ మహిళలను దారుణంగా అవమానిస్తూనే వస్తున్నారని
- By Sudheer Published Date - 05:15 PM, Mon - 30 September 24

సోషల్ మీడియా (Social Media) లో తనపై చేస్తున్న ప్రచారం ఫై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తో కలిసి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలుకుతూ రఘునందన్ రావు ఆమె మెడలో పూలదండ వేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బీఆఎస్ నేతలు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు. దీనిపై మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేసారు. ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టడం సమంజసం కాదని మీడియా సమావేశం లో ఆమె అన్నారు.
బిఆర్ఎస్ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి ట్రోలింగ్, వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా..? అని సురేఖ ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడే కాదని.. మొదటి నుంచి కూడా కేసీఆర్ మహిళలను దారుణంగా అవమానిస్తూనే వస్తున్నారని..మహిళలను అవమానించడం బిఆర్ఎస్ కు కొత్తమీ కాదన్నారు. రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని కూడా అవమానించారని గుర్తుచేశారు.
అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం.. కానీ, ఒక మహిళను నేరుగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా అవమానించడం సరికాదని హితవు పలికారు. ట్రోలింగ్ వల్ల నిన్నటి నుంచి తాను భోజనం కూడా చేయలేదని ఆవేదన చెందారు. ఈ ట్రోల్స్ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు శ్రేణులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Read Also : Roja : సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు