Telangana Liquor: తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాక్.. కారణమిదే..?
తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు భారీ షాక్ తగులనుంది.
- By Hashtag U Published Date - 11:50 PM, Sat - 1 October 22

తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు భారీ షాక్ తగులనుంది. దసరా పండుగ సందర్భంగా మద్యం సీసాల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లిక్కర్ రేట్లను పెంచేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైందని ప్రచారం నడుస్తోంది. దసరా సందర్భంగా మందు రేట్లు పెంచి ఎక్కువ ఆదాయం రాబట్టుకోవాలని సర్కార్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఓవైపు తెలంగాణలో మద్యం కొరత, మరోవైపు పండగ డిమాండ్‌ను బట్టి ప్రభుత్వం ధరల పెంపుపై ఈ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ డిమాండ్‌ను బట్టి, 10 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి.
కరోనా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మన రాష్ట్రంలో మూడుసార్లు మద్యం ధరలను పెంచారు. అయితే డిస్టిలరీలకు చెల్లించే ప్రాథమిక ధరను ప్రభుత్వం పెంచకపోవడంతో డిస్టలరీలు కినుక వహించాయి. ఈఎన్‌ఐ కొరత పేరుతో చీప్ లిక్కర్‌ను కృత్రిమ కొరత సృష్టించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మద్యం ధరల నిర్ణాయక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా మద్యం ధరలను మరో 15 నుంచి 30శాతం పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. ఈ మేరకు బీర్, మద్యం ధరలను పెంచేందుకు అధికారులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.