Anti-BJP front: ఢిల్లీలో బిజీ కానున్న కేసీఆర్.. కేజ్రివాల్‌తో పాటు కీలక నేతలతో భేటి..!
- By HashtagU Desk Published Date - 11:30 AM, Tue - 1 March 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారని సమాచారం. కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడాలని భావిస్తున్నారు.
మరోవైపు ఇటు కేసీఆర్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. దీంతో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఇప్పటికే ముంబయి వెళ్లిన కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన కేసీఆర్, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీ విధానాలతో దేశం నాశనమయిపోతుందని కేసీఆర్ అభిప్రాయంతో వారు కూడా ఏకీభవించారు.
ఇకపోతే ఇటీవల తెలంగాణలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ఎంతదూరమైనా వెళతానని, అవసరమైతే తన చివరి రక్తపు బొట్టు చిందిందే వరకు పోరాటం చేస్తానని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేవిధంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతానని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాపంగా అన్ని రాష్ట్రాలు పురోగమించాలంటే కేంద్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తూ నడుచుకోవాలన్నారు. కులం లేదా మతం పేరుతో ఆటంకాలు సృష్టిస్తే, శాంతిభద్రతలు కారణంగా పెట్టుబడి వాతావరణం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేసీఆర్ అన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం అనే క్యాన్సర్‌ను వ్యాపింప జేస్తుందని, ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని, ఇదొక దుర్మార్గపు విధానమని, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయితే బాగుచేశామో, దేశాన్ని కూడా మనమే బాగు చేసుకోవాలని, ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో ప్రాముఖ్యత వహించాలని కేసీఆర్ అన్నారు. ఈరోజు మన దేశ విద్యార్ధులు, నిపుణులు అమెరికాకు వెళుతున్నారని, అయితే ఇతర దేశాల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చే దశకు మనం భారతదేశాన్ని తీసుకువెళ్ళాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.