Hydraa : ఆ ఎమ్మెల్యే భూమిని స్వాధీనం చేసుకునే దమ్ము ఉందా..? హైడ్రా కు కవిత సూటి ప్రశ్న !
Hydraa : హైడ్రా అధికారులు సర్వే నంబర్లు 307, 329/1, 342 పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పేద ప్రజలు ఇళ్లులేకుండా రోడ్డున పడ్డారు. ఈ ఘటనను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
- By Sudheer Published Date - 07:50 AM, Tue - 23 September 25

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గాజుల రామారం పరిధిలో జరిగిన కూల్చివేతలు పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యాయి. హైడ్రా (Hydraa) అధికారులు సర్వే నంబర్లు 307, 329/1, 342 పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పేద ప్రజలు ఇళ్లులేకుండా రోడ్డున పడ్డారు. ఈ ఘటనను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kaivtha) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పెద్దల కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించాల్సి ఉండగా, పేదల ఇళ్లపైనే దృష్టి పెట్టడం అన్యాయమని ఆమె విమర్శించారు. పండగ సమయాల్లోనూ ఇలాంటి చర్యలు పేదల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
MEGA DSC : పవన్ అన్నను ఆహ్వానించా – లోకేశ్
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వారాంతంలోనే కూల్చివేతలు జరపడం చట్టపరంగా, నైతికంగా తప్పు అని అన్నారు. పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పిల్లలు, మహిళలు బయటకు పంపించి ఇండ్లను కూల్చడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. అరికెపూడి గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్న 12 ఎకరాల భూమిని ముందు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం సాహసిస్తేనే తమ నిజాయితీ బయటపడుతుందని ఆమె సవాలు విసిరారు. అలాగే, పేదలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండానే ఇళ్లను కూల్చడం అనేది మానవత్వానికి విరుద్ధమని కవిత మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా షెడ్లు, ఇండ్లను కూల్చడం సరికాదని ఆమె హితవు పలికారు.
మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. గాజులరామారం పరిధిలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గత కొన్నేళ్లుగా 100 ఎకరాలకు పైగా భూములు కబ్జా అయ్యాయని తెలిపారు. కొందరు నేతలు, అధికారులు ఆ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించగా, కొందరు ఫ్లాట్లు నిర్మించి అమ్మినట్లు వెల్లడించారు. మొత్తం భూముల విలువ సుమారు రూ. 15,000 కోట్లకు చేరుతుందని, అందులోనే రూ. 5,000 కోట్ల విలువైన భూములు ఇప్పటికే అక్రమంగా వినియోగించబడ్డాయని తెలిపారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, ఇకపై కూడా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.