Bjp@Munugodu: మునుగోడు ‘బీజేపీ’లో ముసలం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.
- By Balu J Published Date - 12:16 PM, Sat - 20 August 22

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ప్రస్తుతం అన్ని పార్టీల ఫోకస్ మునుగోడుపైనే. పార్టీ చీఫ్ నుంచి గ్రామ స్థాయి నేతవరకు అంతా ఛలో మునుగోడు అంటూ పరుగులు పెడుతున్నారు. ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. అయితే అసమ్మతి, వలసలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఓ రేంజ్ లో ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కు వ్యతిరేకంగా తీన్మానం చేసేవరకు వెళ్లింది. బీసీ నినాదం టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తోంది. కాంగ్రెస్ లోనూ టికెట్ లొల్లి కొనసాగుతోంది. పాల్వాయి స్రవంతి ఆడియా లీకై వైరల్ గా మారింది. కాంగ్రెస్ లో కలకలం స్పష్టించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కే అసమ్మతి బెడద ఉందని ఇప్పటివరకు భావిస్తుండగా.. తాజాగా కమలం పార్టీలోనూ ముసలం పట్టినట్లు తెలుస్తోంది.
స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా బీజేపీ లో చేరుతున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని ముందు నుంచి బీజేపీలో ఉన్న నేతలు చెబుతున్నారు. స్థానిక నేతలను సంప్రదించకుండానే ఎవరిని పడితే వారిని చేర్చుకోవడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై పాత బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. భూ ఆక్రమలు సహా పలు తీవ్రమైన కేసులున్న తాడూరిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని కొందరు నేతలు.. పార్టీ పెద్దలను నిలదీశారని తెలుస్తోంది.
ఈ విషయం పార్టీ చీఫ్ బండి సంజయ్ దృష్టికి కూడా వెళ్లిందంటున్నారు. తాడూరి ఘటన పార్టీలో విభేదాలకు కారణం కాగా.. అదే తరహాలో ఇతర మండలాల్లోనూ చేరికలు జరిగాయంటున్నారు. స్థానికులతో సంబంధం లేకుండానే ఈటల రాజేందర్ చేరికలు చేపట్టడం వల్లే సమస్య వస్తుందంటున్నారు మునుగోడు కమలం లీడర్లు. తాజాగా ఓ మీటింగ్ లో కాబోయే సీఎం ఈటల రాజేందర్ అంటూ కొంతమంది నాయకులు నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది.