Revanth Reddy: కేసీఆర్ శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందే: స్టేషన్ ఘన పూర్ సభలో రేవంత్!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
- By Balu J Published Date - 03:54 PM, Tue - 14 November 23

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన స్టేషన్ ఘన పూర్ లో జరిగిన విజయ భేరి యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అని, శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు… రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు అని ఆయన అన్నారు.
ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లే, ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండు అని రేవంత్ అన్నాడు. కేసీఆర్ కే వీళ్లపై నమ్మకం లేదు.. అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు. స్టేషన్ ఘనపూర్ కు వందపడలకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాది అని, పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదని రేవంత్ మండిపడ్డారు.
బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకున్నాడని, దద్దమ్మ దయాకర్ రావును మంత్రిని చేశాడని సెటైర్స్ వేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని, రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని, రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తామని అన్నాడు. ఆనాడు 9గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్, ఇప్పుడు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది రేవంత్ అన్నారు.
పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిచే బాధ్యత కాంగ్రెస్ ది అని ఆయన అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఇందిరమ్మను 25వేల మెజారిటీతో గెలిపించాలని, ఇక్కడ ఇందిరమ్మను గెలిపిస్తే అక్కడ సోనియమ్మను గెలిపించినట్లేనని రేవంత్ అన్నారు. కేసీఆర్ శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందేనని రేవంత్ అన్నారు.