HCU Land Issue : ఆందోళన చేసిన ఇద్దరు అరెస్ట్
HCU Land Issue : అరెస్టయిన వారిలో ఎవరూ HCU విద్యార్థులు కాకుండా, ఇతర వ్యక్తులు అయినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు
- By Sudheer Published Date - 09:26 PM, Mon - 31 March 25

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వ్యవహారం (HCU Land Issue) రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ భూవివాదంపై ఆందోళన చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎవరూ HCU విద్యార్థులు కాకుండా, ఇతర వ్యక్తులు అయినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. HCU భూములపై నిరసనలు ముదురుతుండగా పోలీసులు పరిస్థితిని సమీక్షించి, అదుపులోకి తీసుకున్న వారిపై విచారణ జరుపుతున్నారు.
ఇక ఈ భూముల అంశంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక లేఖను బయటపెట్టింది. అందులో 2004లోనే HCU యూనివర్సిటీ భూమిని ప్రభుత్వానికి అప్పగించిందని స్పష్టంగా ఉంది. అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు ఈ ఒప్పంద పత్రంపై సంతకం చేసినట్లు అధికారులు వెల్లడించారు. HCU భూములపై సుదీర్ఘంగా కొనసాగుతున్న వివాదానికి ఈ పత్రాలు మరింత స్పష్టతనిస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
2004లో HCU అధికారికంగా 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకేటాయింపులు, ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై విద్యార్థులు, సామాజిక సంఘాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదురుతుందా? లేక త్వరలో పరిష్కారమవుతుందా? అన్నది వేచి చూడాల్సిన విషయం.