Telangana Govt : విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి – భట్టి
Telangana Govt : విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు
- Author : Sudheer
Date : 31-01-2025 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడి పెంచడం ద్వారా రాష్ట్రాన్ని పురోగమన మార్గంలో తీసుకెళ్లాలని విక్రమార్క పేర్కొన్నారు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
AP DGP: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవి విరమణ వీడ్కోలు! తీవ్ర భావోద్వేగానికి గురైన ఏపీ డీజీపీ..
మహిళా విద్యాభివృద్ధి సమాజ పురోగతికి పునాది అని భావించిన ప్రభుత్వం, మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. చదువు మాత్రమే కాదు, మహిళలకు ఉద్యోగ అవకాశాలను పెంచేలా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, విద్యార్థినిలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలను పారిశ్రామిక రంగంలో నిలబెట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని , స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, వారికి బ్యాంక్ లింకేజీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించనుందని వివరించారు.
Maha Kumbh Mela: ప్రేయసి ఇచ్చిన ఐడియా! ఒక జీవితాన్నే మార్చేసింది…. వాట్ యన్ ఐడియా సర్జీ?
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతి ఏడాది 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందజేస్తున్నామని, వారి తరఫున వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ పాలనలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన విధానాలను ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల 1959లో 15 మంది విద్యార్థినిలతో ప్రారంభమై, ప్రస్తుతం 3,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఇక్కడ చదివిన విద్యార్థినిలు ప్రతిభ కనబరుస్తుండటం హర్షణీయమని, విద్య, ఆరోగ్య రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.