Drivers Strike Effect : హైదరాబాద్ బంకుల్లో నో స్టాక్.. ట్రక్కు డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. ఎందుకీ సమ్మె ?
Drivers Strike Effect : దేశవ్యాప్తంగా బస్సు, ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మె ఎఫెక్టు పెట్రోలు బంకులపై పడింది.
- By Pasha Published Date - 03:59 PM, Tue - 2 January 24

Drivers Strike Effect : దేశవ్యాప్తంగా బస్సు, ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మె ఎఫెక్టు పెట్రోలు బంకులపై పడింది. మన హైదరాబాద్‌లోని పెట్రోలు బంకులు కూడా దీనితో ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ లో బుధవారం నుంచి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె జరగనుంది. కొంతమంది పెట్రోలు ట్యాంకర్ల యజమానులు సోమవారం నుంచే సమ్మెలో ఉన్నారు. తమ ట్యాంకర్లను పెట్రోలు, డీజిల్ సప్లై కోసం వారు పంపడం లేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది పెట్రోల్ బంక్‌ల యజమానులు.. పెట్రోల్, డీజిల్‌లను పెద్దగా స్టాక్ చేసుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా పెట్రోలు ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో చాలా పెట్రోల్ బంకుల్లో ఇంధనం స్టాక్ అయిపోయింది. దీంతో అవి నో స్టాక్ బోర్డును ప్రదర్శిస్తున్నాయి. బస్సు, ట్రక్కు డ్రైవర్ల సమ్మె బుధవారం నుంచి ఉందని తెలియడంతో వాహనదారులు కూడా పెద్దసంఖ్యలో పెట్రోలు బంకులకు(Drivers Strike Effect) క్యూ కడుతున్నారు. ఫలితంగా చాలా బంకుల్లో స్టాక్ ఫాస్ట్‌గా క్లియర్ అయిపోతోంది.
We’re now on WhatsApp. Click to Join.
డ్రైవర్ల సమ్మెకు కారణం ఏమిటి ?
దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె బాట పట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. సోమవారం నుంచే వీరు నిరసనలను ప్రారంభించారు. ఈ సమ్మెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ కోడ్ చట్టాలను ఇటీవల మార్చేసింది. వాటి స్థానంలో మూడు కొత్త క్రిమినల్ కోడ్ చట్టాలను తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. డ్రైవర్లకు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసులకు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ. 7 లక్షల జరిమానా విధించవచ్చు. ఐపీసీ అమల్లో ఉండగా ఇదే కేసులో గరిష్ట శిక్ష కేవలం రెండు సంవత్సరాలే. అందుకే కొత్త చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు శిక్ష విధించే నిబంధనను డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో జరిమానా అంటే ఎలా చెల్లించగలం? అంత భారీగా శిక్ష విధించడం సబబుకాదు అని డ్రైవర్లు వాదిస్తున్నారు. ఎవరినైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేసినప్పుడు బాధితుడి కుటుంబం వారు దాడి చేస్తారనే భయంతోనే తాము పారిపోతామని, వేరే దురుద్దేశం ఉండదని అంటున్నారు.