Mega Food Park : రాష్ట్రంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ రెడీ .. ఎక్కడ ?
Mega Food Park : తెలంగాణలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభం కానుంది.
- By Pasha Published Date - 10:46 AM, Sun - 19 May 24

Mega Food Park : తెలంగాణలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీన్ని ప్రారంభించనున్నారు. దీనివల్ల 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. 2016 సంవత్సరం నవంబరు 13నే ఈ ఫుడ్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. దీని కోసం సేకరించిన మొత్తం భూమిలో 85.85 ఎకరాలను ఆహారశుద్ధి ప్రత్యేక మండలిగా పరిగణిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
మెగా ఫుడ్ పార్కుకు సంబంధించిన మొత్తం స్థలంలో 41.26 ఎకరాలను నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులకు, 10.45 ఎకరాలను రోడ్లకు కేటాయించారు. రూ.109.44 కోట్ల ఖర్చుతో ఇంటర్నల్ రోడ్లు , మురుగు, వాననీటి పారుదల వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్, 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మంచినీటి వసతి సౌకర్యం కల్పించారు. మెగా పార్కు కోసం విశాలమైన పరిపాలనా భవనం, సరకుల నిల్వ గోదాం, స్టాండర్డ్ డిజైన్ కర్మాగారం, ప్యాక్ హౌస్, శిక్షణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీ, వ్యర్థాల శుద్ధి కేంద్రం, క్యాంటీన్, వే బ్రిడ్జిలను కట్టారు. వాషింగ్, గ్రేడింగ్, వేయింగ్, ప్యాకింగ్ వంటి సదుపాయాలతో పాటు రీఫర్ వ్యాన్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్, రీపెనింగ్ ఛాంబర్లు కూడా ఉన్నాయి. పార్కింగ్ వసతులను కల్పించారు. పార్క్ చుట్టూ ప్రహరీ నిర్మించారు.
మెగా ఫుడ్‌పార్క్ సమీపంలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 203 ఎకరాల్లో జామ, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్, సపోటా, నిమ్మ, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేలా రైతులకు అధికారులు సూచించారు. పార్కుకు 200 కిలోమీటర్లలోపు దూరంలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న; నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరి; నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మామిడి; నల్గొండ, వరంగల్‌లలో మాంసం; నల్గొండ, వరంగల్‌లలో కోళ్లు, గుడ్లు, పాలు; వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో మిర్చి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పార్కులో వివిధ కంపెనీలకు స్థలాలు కేటాయించి దాని ద్వారా ఆహారశుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 40.32 ఎకరాల్లో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం 26 ఎకరాల్లో మాత్రమే మౌలిక వసతులున్నాయి. పారిశ్రామిక యూనిట్లకు దరఖాస్తులు కోరగా 70 సంస్థలు ముందుకువచ్చాయి. వీటిలో అయిదు సంస్థలకు స్థలాలు కేటాయించి మిగిలిన సంస్థలకు వివిధ పంటలకు సంబంధించిన యూనిట్లు కేటాయించాలని నిర్ణయించారు. మెగా ఫుడ్‌పార్క్‌కు తగినన్ని రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బుగ్గపాడు సమీపంలో 365, 216, 65 నంబరు జాతీయ రహదారులతో పాటు నాగ్‌పుర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ఉంది. ఈ ఫుడ్ పార్కులో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను మొదట్లోనే ప్రారంభించనున్నారు.