MLA Rajasingh : స్థానికులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను బయటి వ్యక్తులకు కాకుండా స్థానికులకు మాత్రమే
- Author : Prasad
Date : 01-10-2023 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను బయటి వ్యక్తులకు కాకుండా స్థానికులకు మాత్రమే కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పత్రాలను అందజేసేందుకు మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆయన తన డిమాండ్‌ని తెలిపారు. ధూల్‌పేటలో నిర్మించిన 145 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రభుత్వ ఒత్తిళ్లతో గుడుంబా వ్యాపారం చేసి ఆపివేసిన వారికే ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నానని రాజాసింగ్ తెలిపారు. తాను శాసనసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తానని, గుడుంబా వ్యాపారం మానేసిన కుటుంబాలకు ధూల్‌పేటలో నిర్మించిన 145 ఇళ్లను ఇస్తామని అధికార పార్టీ మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం హమీ ఇచ్చిన తర్వాత కొంతమంది బయటి వ్యక్తులను గుర్తించి వారికి ఫ్లాట్‌లు కేటాయించారని తెలుసుకున్నానని.. ధూల్‌పేట గుడుంబా తయారీదారుల పునరావాస పథకంలో భాగంగా కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బయటివారికి ఇళ్లు కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.